హనుమాన్.. ఇంకో కార్తికేయ-2

హిందూ సంస్కృతి, దేవుళ్ళతో ముడిపడ్డ సినిమాలంటే ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు ఊగిపోతున్నారు. కానీ బాలీవుడ్ దర్శకుడు వాళ్ళ అభిరుచికి తగినట్లు సినిమాలు తీయట్లేదు. సరిగ్గా ఇదే సమయంలో దక్షిణాది నుంచి డివైన్ టచ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కార్తికేయ-2, కాంతార లాంటి సినిమాలు నార్త్ ఇండియాను ఎలా ఊపేశాయో తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు సినిమా నార్త్ ఇండియన్ ఆడియన్స్ మనసులు దోస్తోంది. అదే.. హనుమాన్.

హనుమంతుడి చుట్టూ తిరిగే కథ అంటే హనుమాన్ కు ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. కావాల్సిందల్లా మంచి రిలీజ్, టాక్. హనుమాన్ కు అవి రెండూ కలిసి వచ్చాయి. సంక్రాంతి టైంలో బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ రిలీజ్ ఏమి లేకపోవడంతో.. ఈ సినిమాకు ఉత్తరాదిన పెద్ద ఎత్తున థియేటర్లు దక్కాయి. దీనికి తోడు క్రిటిక్స్ అందరూ మంచి రివ్యూలు ఇవ్వడం, టాక్ బాగుండడంతో సినిమా అక్కడ మంచి ఇంపాక్ట్ వేస్తోంది.

తొలి రోజు రెండు కోట్లు రాబట్టిన హనుమాన్ హిందీ వర్షన్.. రెండో రోజు నాలుగు కోట్లకు పైగా కలెక్షన్ తెచ్చుకుంది. మూడో రోజుకు వసూళ్లు ఇంకా పెరిగి ఆరు కోట్లు దాటేయడం విశేషం. మొత్తంగా వసూళ్లు 12 కోట్ల మార్కును అందుకున్నాయి. గతంలో పుష్ప, కార్తికేయ- 2 సినిమాలు కూడా ఇలాగే నెమ్మదిగా వసూళ్లు పెంచుకుని హిందీలో బ్లాక్ బస్టర్ రేంజ్ అందుకున్నాయి. హనుమాన్ చిత్రానికి అన్ని అంశాలు కలిసి వస్తుండడంతో వాటిని మించి పెద్ద సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.