సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందు వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. ఇతని డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే డైరెక్టర్ ఎవరైనా సరే చెన్నైకు వెళ్లి పని చేయించుకోవాల్సిందే. అదృష్టం బాగుండో లేదా హీరో రిక్వెస్ట్ చేస్తేనో తప్ప పదే పదే హైదరాబాద్ వచ్చే పరిస్థితిలో లేడు. రెమ్యునరేషన్ ఎంత అడిగినా ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నా కథ, క్యాస్టింగ్ నచ్చితే తప్ప బాబు ఎస్ అనడం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర మీద తాను ఇవ్వబోయే మ్యూజిక్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు టాపిక్ దీని గురించి కాదు.
మళ్ళీ రావా, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ సితార బ్యానర్ లో విజయ్ దేవరకొండతో ఒక భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ కోసం దీని రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమయ్యింది. ఫిబ్రవరిలో మొదలుపెట్టబోతున్నారు. అయితే నెలల తరబడి ఖాళీగా ఉండటం ఇష్టం లేని గౌతమ్ ఈలోగా కొత్త వాళ్ళతో ఒక చిన్న సినిమాని తీసేశాడు. చిత్రీకరణ అయిపోయింది. మ్యూజిక్ అనిరుధ్ రవిచందరే ఇచ్చాడు. ట్విస్టు ఏంటంటే పాటలన్నీ నెలల క్రితమే పూర్తి చేశాడట. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తానని మాట ఇచ్చాడట.
గౌతమ్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం జెర్సీ టైం నుంచి వాళ్ళిద్దరి మధ్య కుదిరిన స్నేహం. లేదంటే వేరే డైరెక్టర్ అయితే చిన్న చిత్రానికి నన్ను అడగటం ఏంటని తప్పుకునేవాడు. కానీ అనిరుద్ అలా అనలేదు. సమయానికి కోరుకున్న అవుట్ ఫుట్ ఇస్తున్నాడు. ఆల్బమ్ రిలీజ్ కు ముందు అనౌన్స్ మెంట్ గట్రా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి సరైన సమయం కోసం గౌతమ్ ఎదురు చూస్తున్నాడు. జెర్సి హిందీ రీమేక్ డిజాస్టర్ కావడం, రామ్ చరణ్ ప్రాజెక్టు చేతిదాకా వచ్చి జారిపోవడంతో చాలా కసితో రెండు సినిమాల మీద పని చేస్తున్నాడు గౌతమ్. మళ్ళీ రావాని మించి ఫీల్ గుడ్ కంటెంట్ రాబోయే సినిమాలో ఉందట.