ఏపీలో బలపడాలని భావిస్తున్న కాంగ్రెస్‌పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో ఎట్టి పరిస్థితిలోనూ పార్టీకి జవజీవాలు అందించాలని.. పోయిన చోటే వెతుక్కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర విభజనతో తుడిచి పెట్టుకుపోయిన ఏపీలో తిరిగి కాంగ్రెస్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వేసిన తొలి అడుగు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలను పార్టీలో చేర్చుకున్నారు. ఈ నెల 16న ఆమె పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.
ఈ నెల 17న ఏపీ రాజకీయ వ్యవహారాలపై శిఖరాగ్ర సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. దీనికి పార్టలోని పెద్దలు హాజరు కానున్నారు. దీనికి ఒక రోజు ముందే. ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించి.. ఈ కార్యక్రమంతో శ్రీకారం చుట్టించాలని భావిస్తున్నారు. అంటే.. ఈ నెల 16న షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలను తీసుకుంటారు. అనంతరం.. ఆమెకు పార్టీ లక్ష్యం నిర్దేశించింది. తాజాగా రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ యాత్రకు వెళ్లిన షర్మిలకు సీనియర్ నేతలు ఈ లక్ష్యాన్ని తేల్చి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 20 నుంచి 30 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనేది షర్మిల ముందు ఉంచిన ప్రధాన లక్ష్యం. పార్లమెంటు ఎన్నికల్లో 1-2 స్థానాలకు పరిమితం కావాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయడంతోపాటు.. వైఎస్ సానుభూతిని కాంగ్రెస్‌వైపు మళ్లించాలనేది కూడా ప్రధాన లక్ష్యంగా ఉంది. కనీసం 20-30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారా.. కింగ్ మేకర్ కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు వ్యూహం రెడీ చేసుకున్నారు.
తద్వారా.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా.. ప్రభుత్వం ఏర్పడకూడదనే వ్యూహంతో ఉన్నారు. టీడీపీ లేదా.. వైసీపీలు.. 70 లేదా 75 స్థానాలకు పరిమితం అయితే.. మిగిలిన 20-30 స్థానాల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకుంటే.. అప్పుడు ప్రభుత్వానికి తమ అవసరం ఉంటుందని, తద్వారా అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ పెట్టుకున్న లక్ష్యంగా ఉంది. అనంతరం.. 2029 నాటికి మరింత పుంజుకుని పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చేలా చేయాలని భావిస్తోంది. మరి దీనిని షర్మిల ఎంత వరకు సాధిస్తారో చూడాలి.