సైకో ఆలోచనే సమస్య తెచ్చి పెట్టింది

సంక్రాంతి సినిమాలన్నీ వచ్చేశాయి. తీర్పులు కూడా తెలిసినట్టే. కమర్షియల్ లెక్కలు తేలాలంటే ఇంకో వారం పది రోజులు పడుతుంది కానీ బాక్సాఫీస్ వసూళ్లు, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే విజేత ఎవరో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా మంచి అంచనాలతో ప్రమోషన్లు చేసుకుని రెస్పాన్స్ పరంగా చివరి స్థానంలో ఉన్నది మాత్రం సైంధవే. చాలా గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ ని మాస్ యాక్షన్ అవతారంలో చూడబోతున్నామని ఎదురు చూసిన అభిమానులు పెర్ఫార్మన్స్ పరంగా సంతృప్తి పడ్డారు కానీ దర్శకుడు శైలేష్ కొలను అంచనాలు అందుకోవడంలో తడబడ్డాడు.

ఇక్కడో అంశాన్ని సీరియస్ గా గమనించాలి. సైంధవ్ స్టోరీలో హీరోకి అంత బిల్డప్ ఇచ్చారు కానీ నిజానికి అతని గతమేంటి, ముఖేష్ ఋషి – నవాజుద్దీన్ సిద్ధిక్ ఎందుకంత భయపడి వణికిపోయారో చూపించలేదు. క్లైమాక్స్ అయ్యాక స్వయంగా శైలేషే ఫ్రేమ్ లోకి వచ్చి ‘సైకో’ పేరుతో ఒక స్క్రిప్ట్ సిద్ధం చేశానని, జనంలోకి తీసుకెళ్తే సంచలనం అవుతుందని రామజోగయ్య శాస్త్రికి చెబుతున్న సీన్ తో ఎండ్ కార్డు పడి పార్ట్ 2 వస్తుందనే హింట్ ఇచ్చాడు. నిజానికి ఇలా ప్లాన్ చేయడం వల్లే సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేయకుండా రెండో భాగం కోసం సాగతీత చేశారనే అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతోంది.

ఇప్పుడీ మూవీకొచ్చిన రెస్పాన్స్ చూస్తే సీక్వెల్ కష్టమే అనిపిస్తోంది. సెలవుల వల్ల అంతో ఇంతో డీసెంట్ కలెక్షన్స్ దక్కుతున్నా ఒక్కసారి పండగ హడావిడి అయిపోతే ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. వెంకటేష్ నెల రోజులకు పైగా సైంధవ్ ప్రమోషన్ కోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడెక్కడో తిరిగారు. కాలేజీలకు వెళ్లారు. టీవీ ఛానల్స్ రియాలిటీ ఈవెంట్స్ కు హాజరయ్యారు. అడిగిన వాళ్లకు లేదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇన్ని చేసినా రిజల్ట్ కనిపించడం లేదు. ఒకవేళ సైకో స్టోరీని కూడా సైంధవ్ లోనే భాగం చేసి ఉంటే గణేష్ రేంజ్ లో ఒక మాస్ కల్ట్ యాక్షన్ బొమ్మ అయ్యేదేమో.