వాటికి హనుమాన్ తో రిస్కే

ఈసారి సంక్రాంతికి మూడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఒక చిన్న హీరో చిత్రం కూడా రేసులో నిలిచింది. అదే.. హనుమాన్. అయితే హీరో, దర్శకుడు చిన్నవాళ్లే కానీ సినిమా రేంజ్ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.బుక్ మై షోలో సంక్రాంతి సినిమాలన్నింట్లోకి అత్యధిక ఇంటరెస్ట్స్ సంపాదించడమే కాదు.. అడ్వాన్స్ బుకింగ్స్ లో చూపిస్తున్న జోరు చూస్తే హనుమాన్ రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.

జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తుండగా ఆరోజుకు పెట్టిన షోలు పెట్టినట్టే సోల్డవుట్ అయిపోతున్నాయి. దీంతో హనుమాన్ చిత్రాన్ని ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అందరికీ అర్థమవుతోంది. గుంటూరు కారం కథ కమామీషు వేరు కాబట్టి దానికి హనుమాన్ నుంచి పెద్దగా ముప్పు లేకపోవచ్చు. కానీ మిగతా రెండు చిత్రాలకు మాత్రం ఈ సినిమా నుంచి ప్రమాదం పొంచి ఉంది.

సంక్రాంతి సినిమాలో ప్రేక్షకుల వైపు నుంచి ఫస్ట్ ప్రయారిటీ గుంటూరు కారంకే ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ స్క్రీన్లు దక్కాయి. ముఖ్యంగా తొలి రోజు ఏపీ, తెలంగాణాలోని 90 శాతానికి పైగా థియేటర్లలో ఈ సినిమానే ఆడబోతుంది కాబట్టి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. తర్వాతి రెండు రోజుల్లో ఉన్న థియేటర్లలో బాగా ఆడితే చాలు సినిమా లాభాల బాట పడుతుంది. కానీ సైంధవ్, నా సామి రంగ చిత్రాల వ్యవహారం అలా కాదు. ప్రస్తుతానికి గుంటూరు కారం తర్వాత ప్రేక్షకుల ఛాయిస్ హనుమాన్ లాగే కనిపిస్తోంది.

ఈ సినిమాకు మంచి టాక్ వస్తే ఆ ప్రభావం సైంధవ్, నా సామి రంగ చిత్రాల మీద ఖచ్చితంగా పడుతుంది. వాటికి మామూలుగానే ఓపెనింగ్స్ పెద్దగా వచ్చేలా కనిపించడం లేదు. సంక్రాంతికి ముందుగా వచ్చే రెండు చిత్రాలు చూసేశాక ప్రేక్షకులు వీటి వైపు ఎంత మేర చూస్తారు అన్నది ప్రశ్న. టాక్ గొప్పగా ఉంటే ఓకే కానీ అది తేడా కొడితే మాత్రం ఆ సినిమాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావమే పడుతుంది.