మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుంటూరు కారం అనుమతులు తెలంగాణ వైపు నుంచి వచ్చేశాయి. హైదరాబాద్ లో అర్ధరాత్రి 1 గంట షోకు ఏకంగా 23 థియేటర్లకు పర్మిషన్ ఇవ్వడం విశేషం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కి ఇచ్చిన పెంపే దీనికి వర్తించేలా జిఓ వచ్చేసింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న సింగల్ స్క్రీన్లు కాకుండా మిగిలినవి ఉదయం 4 గంటలతో మొదలుపెట్టి ఆరు షోలు వేసుకునేలా వెసులుబాటు ఇచ్చారు. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. సో రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్న అభిమానులకు అది నెరవేరాలంటే పాజిటివ్ టాక్ రావడమొకటే ఆలస్యం.
ఈ లెక్కన మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా 410 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 250 రూపాయలు ధర ఉండబోతోంది. అయితే గుంటూరు కారం ఆర్ఆర్ఆర్, బాహుబలి లాగా వందల కోట్లతో తీసిన విజువల్ గ్రాండియర్ కాదు. ఆర్టిస్టులు, టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్లు మినహాయిస్తే ప్రొడక్షన్ కాస్ట్ సగటు కమర్షియల్ చిత్రానికి ఎంతవుతుందో అంతే అయ్యింది. పైగా ఫారిన్ షెడ్యూల్స్ లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడే మొత్తం పూర్తి చేశారు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఈ రేట్లను లెక్క చేయరు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకరకంగా భారమే.
ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జిఓ రావాల్సి ఉంది. 20 నుంచి 40 రూపాయల మధ్యలో మాత్రమే ఉంటుందని అంటున్నారు కానీ ఆర్డర్స్ వస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఇవాళ గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక ఇవాళ రాత్రి లేదా రేపు ఉత్తర్వులు రావొచ్చని అంటున్నారు. అయితే ఎంత పెంచినా తెలంగాణ స్థాయిలో పెంపు ఉండదనేది మాత్రం స్పష్టం. ఆడియన్స్ వైపు నుంచి ఆలోచిస్తే ఇది మంచిదే. కాకపోతే బాక్సాఫీస్ ఫిగర్లు మరీ భారీగా కనపడకపోవచ్చు. గుంటూరు కారంతో పోటీ పడుతున్న హనుమాన్ ఎలాంటి పెంపుకు వెళ్లకుండా సాధారణ ధరలతోనే ప్రీమియర్లు కూడా వేస్తోంది.