సినిమా దెబ్బేసినా సిరీస్ నిలబెట్టింది

90s

డెవిల్ విడుదలకు ముందు దర్శకుడి మార్పు గురించి ఎంత రచ్చ జరిగిందో చూశాం. తొలుత ప్రకటించిన నవీన్ మేడారం కాకుండా నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ కార్డు వేసుకోవడం గురించి గట్టిగానే గుసగుసలు వినిపించాయి. అయితే అనుభవలేమి వల్లే తన చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చిందనే వివరణ ప్రొడ్యూసర్ ఇచ్చారు కానీ అదేమంత హైలైట్ కాలేదు. కట్ చేస్తే డెవిల్ ఫ్లాప్ దిశగా వెళ్తోంది. మొదటి రెండు మూడు రోజులు ప్లస్ న్యూ ఇయర్ సందర్భంగా వసూళ్లు కొంత మెరుగ్గా అనిపించినా చివరికి లాభాల మాటేమో కానీ నష్టాలు ఖాయమనే దిశగా ఫిగర్లు నమోదవుతున్నాయి.

సరే బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు డెవిల్ గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. నవీన్ మేడారం దీని విషయంలో ఫెయిలైనా వెబ్ సిరీస్ రూపంలో పెద్ద ఊరట దక్కింది. అతనే నిర్మాతగా అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. దర్శకుడు నవీన్ కానప్పటికీ పర్యవేక్షణ మొత్తం తన ద్వారానే జరిగిందట. ఈటీవీ విన్ లో మొన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 90స్ కి రివ్యూస్ సైతం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. కుర్రాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

దెబ్బకు సెకండ్ సీజన్ కు కావాల్సిన బజ్ వచ్చేయడంతో దాని పనులను వేగవంతం చేశారు. నవీన్ మేడారంకి ఇది పెద్ద ఊరట. ఎందుకంటే హంగామా లేకుండా కేవలం స్కూలు, ఇల్లు రెండే లొకేషన్లతో ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చేలా దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతిభను గుర్తించడం స్థాయిని పెంచేదే. ప్రస్తుతం కొత్త సినిమా కోసం ప్రయత్నాల్లో ఉన్న నవీన్ మేడారం ఒక మీడియం రేంజ్ స్టార్ తో మూవీ ప్లాన్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. 90స్ క్రెడిట్ తనదేనని చెప్పలేం కానీ క్రైమ్ రాజ్యమేలుతున్న ఓటిటి ట్రెండ్ లో ఇలాంటి నోస్టాల్జియా ఎంటర్ టైనర్ నిర్మించి హిట్టు కొట్టడం విశేషమే.