ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రేక్షకుల ఆసక్తి దృష్టిని బాగా ఆకర్షిస్తున్న చిన్న సినిమా హనుమాన్. నిజానికి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తికి తోడు సానుభూతి కూడా ఉంది. అందుకు కారణం మిగతా సంక్రాంతి సినిమాలతో పోలిస్తే దీనికి థియేటర్లు మరీ తక్కువ ఇవ్వడమే. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో కేవలం నాలుగంటే నాలుగు థియేటర్లు.. అవి కూడా పాతకాలంనాటివి ఇవ్వడం పట్ల పెద్ద చర్చే జరుగుతోంది. మొన్న సినీ పెద్దలు అంతా కలిసి సమావేశమై ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని సినిమాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. రిలీజ్ దగ్గర పడ్డాక అయినా పరిస్థితి మారుతుందేమో అని చూస్తే ఇప్పటివరకు అయితే ఎలాంటి కదలికా లేదు.
ప్రస్తుతానికి హనుమాన్ టీం దింపుడు కల్లెం ఆశలతో ఉంది. ఈరోజే హనుమాన్ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. చిరు వచ్చి ఈ సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడి, చిత్ర బృందానికి భరోసాగా నిలిస్తే.. అప్పుడైనా థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుని ఆధిపత్యం చెలాయిస్తున్న సినీ పెద్దల్లో కొంచెం మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.
హనుమాన్ టీం థియేటర్ల సమస్య గురించి చిరుకు విన్నవించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆయన స్టేజ్ మీద ఒకసారి ఈ విషయం ప్రస్తావించాడు అంటే కచ్చితంగా మార్పు రావచ్చు. అలా అయినా హనుమాన్ కు మరి కొన్ని స్క్రీన్లు యాడ్ అవుతాయేమో చూడాలి. సినిమా మీద ఎంత భరోసా ఉన్నప్పటికీ సంక్రాంతికి ఇంత పోటీ మధ్య థియేటర్లు దక్కకపోతే ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్ల మీద తీవ్ర ప్రభావమే పడుతుంది. మరి మరి హనుమాన్ చివరికి ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.