మిల్లర్ మంచి ఛాన్స్ వదులుకున్నట్టే

ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రఘువరన్ బిటెక్ సూపర్ హిట్ తర్వాత కొన్ని ఫ్లాపులతో నెమ్మదించినప్పటికీ సరైన హైప్ తో సినిమా వస్తే ఓపెనింగ్స్ తో పాటు నిర్మాతలు సేఫయ్యేలా వసూళ్లు రాబట్టగలడని టాలీవుడ్ డెబ్యూ సార్ నిరూపించింది. గత ఏడాది టాప్ గ్రాసర్స్ గా ఒకటిగా నిలవడం చూసి ఫ్యాన్స్ తెగ సంతోషించారు. ఇప్పుడు జనవరి 12 సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ గా రాబోతున్నాడు. అయితే తెలుగులో థియేటర్ల కొరతతో పాటు విపరీతమైన పోటీ వల్ల మన భాషలో సమాంతరంగా రానట్టే. నిర్మాతల వైపు ఏదైనా చివరి నిమిషం అద్భుతాలు జరిగితే తప్ప.

ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. బ్రిటిషర్ల నేపథ్యంలో స్వాతంత్రం రాక ముందు కెప్టెన్ గా పని చేసే మిల్లర్ అనే భారతీయుడు తీవ్రవాదిగా మారిపోయి ఇంగ్లీష్ దొరల మీద నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే కిరాతకుడిగా మారతాడు. అణివేతకు గురవుతున్న తన గూడెం కోసం రాక్షసుడై ఉగ్రావతారం ఎత్తుతాడు. డెవిల్ గా పిలుచుకునే మిల్లర్ వెనుక అసలేం జరిగిందనే పాయింట్ మీద దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో పాటు మన సందీప్ కిషన్ కూడా ఇందులో ప్రధానమైన క్యామియో చేశాడు.

అంచనాలు పెంచేలా ఉంది కానీ ఒకేటైంలో రాకపోవడం వల్ల కెప్టెన్ మిల్లర్ తెలుగు మార్కెట్ లో కీలక షేర్ ని తగ్గించుకున్నట్టే. ఒకవేళ వారం ఆలస్యంగా ఇక్కడికి తెచ్చినా అప్పటికే రివ్యూలు, టాక్ రూపంలో జాతకం మొత్తం తెలిసిపోయి ఉంటుంది. పైరసీ ప్రింట్లు ప్రత్యక్షం అయ్యుంటాయి. అయితే సామాన్య ప్రేక్షకులకు వీటి మీద అంతగా అవగాహన ఉండదనుకున్నా ఒరిజినల్ వెర్షన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మాత్రం లేట్ అయినా సరే మిల్లర్ ఇక్కడ వర్కౌట్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఓజిలో నటిస్తున్న ప్రియాంకా మోహన్ ఇందులో హీరోయిన్ కాగా జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు