టార్గెట్లు ఒత్తిళ్ల మధ్య సామిరంగ గుమ్మడికాయ

ఒక స్టార్ హీరో పూర్తిగా సహకరించి నాన్ స్టాప్ షూటింగ్ చేయడానికి తోడ్పడితే ఎంత వేగంగా సినిమా పూర్తి చేయొచ్చో నా సామిరంగ ఉదాహరణగా నిలుస్తోంది. కేవలం 70 వర్కింగ్ డేస్ లో పాటలతో సహా కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేశారు. సంక్రాంతిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదన్న నాగార్జున పట్టుదలే దీనికి కారణమని వేరే చెప్పనక్కర్లేదు. పోటీ వల్ల థియేట్రికల్ రెవిన్యూ మీద అనుమానంగా ఉన్న నిర్మాతకు భరోసా ఇచ్చేలా మొత్తం హక్కులు కొనడమే కాదు ఓటిటి రైట్స్ ని దగ్గరుండి హాట్ స్టార్ తో డీల్ చేయించడంలో నాగ్ పాటించిన స్ట్రాటజీ మామూలుది కాదు.

ఇక్కడ కొన్ని కీలక విషయాలు గమనించాలి. మలయాళం పోరంజు మరియం జోస్ ని తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతోనే రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఒప్పందాల విషయంలో ఏర్పడిన గందరగోళంతో పాటు ప్రసన్న దీని బరువుని మోయలేడనే అనుమానం నెలల తరబడి ఆగిపోయేలా చేసింది. చివరి నిమిషం దాకా మెగా ఫోన్ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ చేతికి వస్తుందని చాలా మందికి తెలియదు. డెబ్యూతోనే ఇంత వేగంగా నాగార్జున రేంజ్ హీరోని విజయవంతంగా హ్యాండిల్ చేశాడు.

అసలైన ఛాలెంజ్ ఇక ముందుంది. ఇంత పంతం పట్టి వచ్చిన నా సామిరంగ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలి. యావరేజ్ టాక్ వచ్చినా గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ వీటిలో ఒకటి రెండో పూర్తిగా డామినేట్ చేస్తాయి. కాకపోతే పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నిజంగానే పండగ నేపధ్యాన్ని తీసుకుని తీశారు కాబట్టి నాగ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కీరవాణి పాటలు తెరమీద చూశాక ఇంకా బాగా రీచ్ అవుతాయని టీమ్ అంటోంది. అల్లరి నరేష్ ప్రాధాన్యాన్ని ఒరిజినల్ వెర్షన్ కన్నా ఎక్కువ పెంచారు. రాజ్ తరుణ్ కి జోడిని కూడా పెట్టారు. ఇంకో రెండు రోజుల్లో సెన్సార్ లాంఛనం పూర్తి చేస్తారు.