పెద్దల ప్రమేయం ప్రతిసారి ఉండాలి

నిన్న సంక్రాంతి సినిమాల రద్దీని తగ్గించడం కోసం ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి ఈగల్ రేస్ నుంచి తప్పుకుని ఫిబ్రవరికి వెళ్లిపోయింది. పేరుకి సైడయ్యింది ఒకటే అయినా దీని వల్ల కలిగే లాభం చాలా పెద్దది. మిగిలిన నలుగురికి అదనంగా స్క్రీన్లు తోడవుతాయి. వసూళ్లలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. షూటింగే పూర్తి కాని నా సామిరంగని ఒప్పించుకుండా ఫైనల్ కాపీ సిద్ధంగా ఉన్న ఈగల్ ని వాయిదా వేయించడం పట్ల రవితేజ అభిమానులు గుర్రుగా ఉన్నా జానర్ దృష్ట్యా చూస్తే సోలో రిలీజ్ కు రావడమే మంచి నిర్ణయం.

ఇకపై ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా పెద్దల ప్రమేయం ఉండాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. గతంలోనూ చాలా వచ్చాయి కానీ ఇంత చొరవ తీసుకున్న దాఖలాలు పెద్దగా లేవు. సలార్ వల్ల వినాయక చవితికి ఏర్పడిన గందరగోళం వల్ల పండక్కు డబ్బింగ్ సినిమాలే దిక్కయ్యాయి. నెలాఖరున వచ్చినందు వల్ల స్కంద నష్టపోయింది. గతంలో వారసుడు, పేట విడుదల టైంలో రేగిన వివాదాలను ఎవరూ అడ్రెస్ చేయలేకపోయారు. నిన్న హనుమాన్ నిర్మాత సంధించిన ప్రశ్నలకు సైతం సరైన సమాధానం దొరకలేదు. చిన్న సినిమాగా చివరి చోటు ఇచ్చి సరిపెట్టేశారు.

రాబోయే రోజుల్లో ముఖ్యంగా వేసవిలో మళ్ళీ ఇలాంటి సందిగ్దత రాదన్న గ్యారెంటీ లేదు. ప్యాన్ ఇండియా సినిమాల ఊగిసలాట చూస్తుంటే అదే జరిగేలా ఉంది. హఠాత్తుగా డేట్లను ప్రకటించడం, తర్వాత చెప్పా పెట్టకుండా మార్చేసుకోవడం మీడియం రేంజ్ చిత్రాలను విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. ఇది తేలికగా పరిష్కరించే సమస్య కాకపోయినా కనీసం ముందస్తుగా స్పష్టమైన సమాచారం ఇచ్చే దిశగా కొన్ని నియమ నిబంధనలు పెట్టుకోవడం అవసరం. కాసిన్ని థియేటర్లు దక్కించుకోవడమే సవాల్ గా మారుతున్న చిన్న సినిమాలకు చేయూతనిచ్చే దిశగా ఏవైనా చర్యలు చేపడితే బాగుంటుంది.