నిర్మాతల కష్టం అర్థం చేసుకోవాలని హీరోలకు పిలుపునిచ్చాడు నేచురల్ స్టార్ నాని. కరోనా కారణంగా నిర్మాతలు కుదేలైపోయారని.. ఈ నేపథ్యంలో పారితోషకాలు తగ్గించుకోవాలని అతను సూచించాడు. ఏ సినిమా అయినా లాభం రావాలన్న ఉద్దేశంతోనే మొదలుపెడతామని.. ఆశించినంత వసూళ్లు రావన్నపుడు తప్పకుండా పారితోషకం తగ్గించాలని.. నిర్మాతలకు నష్టం రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని నటీనటులు, టెక్నీషియన్లను ఉద్దేశించి అతనన్నాడు.
అలాగని హీరోలందరూ తమ పారితోషకాన్ని తగ్గించుకోవాలని తాను జనరల్ స్టేట్మెంట్ ఇవ్వనని.. ఒక సినిమాకు నష్టాలు వస్తున్నాయి, ఆశించిన లాభాలు రావట్లేదు అన్నపుడు పారితోషకం తగ్గించుకోవడమో, లేదా కొంత వెనక్కి ఇవ్వడమో చేయాలని.. నిర్మాతకు ఏమీ మిగలదనుకుంటే జీరో పారితోషకానికి కూడా వెనుకాడకూడదని నాని అన్నాడు.
ఇక శుక్రవారం అర్ధరాత్రి అమేజాన్ ప్రైమ్ ద్వారా తన సినిమా ‘వి’ విడుదల కాబోతుండటం గురించి నాని స్పందిస్తూ.. థియేటర్లలోనే తన సినిమా రిలీజ్ కావాలని కోరుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ తప్ప మరో మార్గం లేదని.. 200 దేశాల్లో ఈ చిత్రం విడుదల కాబోతుండటం సంతోషమే అని నాని అన్నాడు. ఈ సినపిమా అనుభవం గురించి నాలుగేళ్ల తర్వాత కూడా కథలు కథలుగా చెప్పుకోవచ్చని అతనన్నాడు.
తన కొత్త సినిమాల గురించి చెబుతూ.. ‘టక్ జగదీష్’ షూటింగ్‌ను అక్టోబరు మొదటి వారంలో తిరిగి మొదలుపెడతామని.. అది పూర్తయ్యాక ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఆరంభమవుతుందని.. ఇవి కాక రెండు సినిమాలు ఒప్పుకున్నానని నాని తెలిపాడు. అందులో ఒకటి ఓ స్టార్ డైరెక్టర్‌తో ఉంటుందని, మరొకటి కొత్త దర్శకుడితో చేస్తానని నాని వెల్లడించాడు.