మణిశర్మ ఆవేదనలో న్యాయముంది కానీ

ఇప్పుడు ఫామ్ తగ్గిపోయింది కానీ రెండు వేల దశకంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ప్రభంజనం మాములుగా ఉండేది కాదు. జూనియర్ సీనియర్ తేడా లేకుండా స్టార్ హీరోలందరికీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన ఘనత ఆయన స్వంతం. కేవలం బీజీఎమ్ కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు లక్షల్లో ఉండేవారు. ఇదంతా గతం. ఫ్లాపులు పడ్డాక కెరీర్ లో బ్రేక్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తో బలమైన కంబ్యాక్ ఇచ్చారనుకుంటే ఆ తర్వాత వరస డిజాస్టర్లు ఉక్కిరిబిక్కిరి చేసి మళ్ళీ వెనక్కు లాగాయి. ఇప్పుడాయన ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ మీదే ఉన్నాయి. ఇది బ్రేక్ ఇస్తే మళ్ళీ ఊపందుకోవచ్చు.

తనను స్టార్ హీరోలు దూరం పెట్టడం పట్ల ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మణిశర్మ ఆవేదన వ్యక్తం చేయడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. తనకే అన్ని ఆఫర్లు ఇవ్వాలని కోరుకోవడం లేదని, తమన్ దేవిలకు ఎన్నేసి ఇచ్చినా రొటేషన్ పద్ధతిలో తాను ఒక ఛాన్స్ ఆశించడం తప్పేమిటనే ప్రశ్న ఆయన మాటల్లో వినిపించింది. మహేష్ బాబుతో ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ ఒకప్పుడు బలంగా ఉన్న తమ బాండింగ్ ఇప్పుడు లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటల కంపోజింగ్ లో కలిసి డాన్సులు కూడా చేశామని, కానీ ఇప్పుడు కలుసుకోవడమే అరుదైపోయిందని ఫీలయ్యారు.

ఆయన ఆవేదనలో న్యాయం ఉంది కానీ వచ్చిన అవకాశాలను గొప్పగా మలచుకుంటే తప్ప ఎంత సీనియరైనా నిలదొక్కుకోవడం కష్టం. ఆచార్య, శాకుంతలం, శ్రీదేవి సోడా సెంటర్, సీటిమార్, భళా తందనాన ఇవేవి ఆషామాషీ హీరోలు, నిర్మాతలు చేసినవి కాదు. కానీ ఒకటి రెండు పాటలు తప్ప మొత్తం ఆల్బమ్ పరంగా నిరాశపరిచినవే. హిట్ అనిపించుకున్న బెదురులంక 2012లోనూ మెలోడీ బ్రహ్మ మార్క్ తెలియలేదు. సో మణిశర్మ అర్జెంట్ గా డబుల్ ఇస్మార్ట్ తో తన కంపోజింగ్ పవర్ తగ్గలేదని నిరూపించుకోవాలి. అలాంటి హిట్లు వరసగా పడాలి. అప్పుడే పవన్ మహేష్ లాంటి స్టార్ల నుంచి పిలుపులు వస్తాయి.