హనుమాన్ కు బెదిరింపులు వాస్తవమే!

2024 సంక్రాంతి పండక్కి ఏకంగా ఐదు సినిమాలు షెడ్యూల్ కావడం.. వాటిలో ఏది రేసు నుంచి తప్పుకునేలా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారంతో పాటు హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగా సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటికి థియేటర్ల కేటాయింపు సవాలుగా మారడంతో నిర్మాతల మండలి రంగంలోకి దిగింది. పండుగ బరిలో ఉన్న ఐదు సినిమాలు నిర్మాతలతో దిల్ రాజు నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు.

అవకాశం ఉన్న వాళ్ళు తమ సినిమాను వాయిదా వేసుకోవాలని అందరికీ చెప్పామని దిల్ రాజు చెబుతూనే.. హనుమాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఒక మంచి సలహా ఇచ్చానని, వినడం వినకపోవడం తన ఇష్టమని అన్నాడు రాజు. ఆయన మాటలను.. ఈ సమావేశానికి సంబంధించి ఇన్ సైడ్ టాక్ ను బట్టి చూస్తుంటే.. సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి హనుమాన్ నే టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఈ మేరకు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.

సంక్రాంతి రేసు నుంచి తమ సినిమాను తప్పించడానికి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు తాజాగా మీడియా ఇంటర్వ్యూల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ నొక్కి వక్కాణించడం గమనార్హం. బెదిరించారు అనే మాట వాడలేదు కానీ హనుమాన్ ను పోటీ నుంచి తప్పించడానికి కొందరు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు ప్రశాంత్ చెప్పాడు. అయితే తాము సంక్రాంతి బరి నుంచి తప్పుకునే అవకాశం లేదని ప్రశాంత్ స్పష్టం చేశాడు. సంక్రాంతి సినిమాల్లో ముందుగా డేట్ ప్రకటించిన తామే అని.. తర్వాత ఒక్కో సినిమా పోటీలోకి వచ్చిందని అలాంటప్పుడు తామెందుకు తప్పుకుంటామని ప్రశాంత్ ప్రశ్నించాడు.

కొన్ని కార్ల మధ్య పోటీలోకి ఒక సైకిల్ వస్తే దెబ్బ తినేది సైకిల్ ఏ కదా అని అడిగితే.. ఆ సైకిల్ బలమైంది కావచ్చు కదా.. అది గుద్దితే కారుకే డెంట్ పడొచ్చు కదా అంటూ తమ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ గురించి చెప్పకనే చెప్పాడు ప్రశాంత్. టాలీవుడ్ పెద్దలు కొందరు గట్టి ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. నైజాంలో హనుమాన్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అండగా నిలుస్తున్న నేపథ్యంలో సంక్రాంతి రేసు నుంచి ఈ చిత్రం తప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు.