సలార్ పుకార్ల వెనుక ఎవరు ఉన్నారు

అవలీలగా అయిదు వందల కోట్ల మార్కుని దాటేసిన సలార్ కు ఇంకో వీకెండ్ చేతుల్లోకి వచ్చేసింది. కొత్తగా రిలీజైన వాటిలో డెవిల్ తో సహా దేనికీ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం ప్రభాస్ టీమ్ కి కలిసి వస్తోంది. పోస్ట్ రిలీజ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్త ఇంటర్వ్యూలు ఇస్తూ విశేషాలు పంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా సలార్ కు కార్పొరేట్ బుకింగ్స్ చేసి కలెక్షన్లు ఎక్కువగా చూపిస్తున్నారని, జనవరి 12 నుంచి ఓటిటి స్ట్రీమింగ్ ఉంటుందని ఇలా ఏవేవో ప్రచారాలను నార్త్ మీడియా ఉదృతం చేసింది. ఇది నిజమని నమ్మేసిన ఫ్యాన్స్ లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు.

వాస్తవానికి సలార్ ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై అయిదు రోజుల కన్నా ముందే డిజిటల్ లో వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉత్తరాది మల్టీప్లెక్సులతో బాలీవుడ్ చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బింగ్ మూవీ అయినా సరే తక్కువ గ్యాప్ లో ఓటిటికి ఇస్తే దాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించమని ముందే చెప్పాయి. లియో ఈ కారణంగానే నార్త్ బెల్ట్ లో కోట్ల రూపాయల వసూళ్లను కోల్పోయింది. సింగల్ స్క్రీన్లకు ఈ నిబంధన లేదు. సలార్ మొదటి రోజే అన్ని బాషల డబ్బింగ్ వెర్షన్లు రిలీజయ్యాయి. సో కండీషన్ కు అనుగుణంగానే అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి నో ఛాన్స్.

డంకీకి మద్దతు ఇవ్వడం కోసం ఒక వర్గం నెటిజెన్లతో పాటు కొందరు ఇన్ఫ్లు యెన్సర్లు ఇదంతా చేశారని తెలుస్తోంది. చాలా చోట్ల స్పందన ఉండదనే అనుమానంతో మల్టీప్లెక్సులు రద్దు చేసిన కొన్ని తెల్లవారుఝాము షోలను హౌస్ ఫుల్ లాగా చూపించి మోసం చేశారని ట్విట్టర్ హ్యాండిల్స్ లో గట్టిగానే తిప్పారు. మిగిలిన షోల ఆక్యుపెన్సీలు బాగానే ఉన్నా వాటిని చూపించకుండా ప్రచారం చేస్తున్న తీరు డార్లింగ్ అభిమానులను కన్ఫ్యూజ్ చేసింది. ఎవరు ఏం చేసినా షారుఖ్ ఖాన్ మీద ప్రభాస్ చాలా స్పష్టమైన ఆధిపత్యంతో బాక్సాఫీస్ యుద్ధం గెలిచాడన్నది వాస్తవం.