సంక్రాంతికి మునిగే సినిమా ఏదో?

తెలుగు సినిమాలు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే అనడంలో మరో మాట లేదు. రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి టాక్ వస్తే మామూలుగా వచ్చేదాంతో పోలిస్తే 20 30 శాతం అదనపు వసూళ్లు వస్తాయి. అలవైకుంఠ పురములో, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు వాటి స్థాయిని మించి వసూళ్ల మోత మోగించాయంటే అందుకు కారణం సంక్రాంతికి రిలీజ్ కావడమే. అందుకే ఈ పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారు. చాలా ముందు నుంచే బెర్తులు బుక్ చేసుకుంటారు.

అయితే సంక్రాంతికి హిట్ టాక్ వస్తే అదనపు వసూళ్లు రావడం నిజమే కానీ.. ఈ టైంలో పోటీ ఎక్కువ ఉంటే థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కవు. దీనికి తోడు టాక్ తేడా కొట్టిందంటే దారుణంగా దెబ్బతింటుందా సినిమా.

అందరూ పాజిటివ్ యాంగిలే చూస్తున్నారు తప్ప ఈ నెగిటివ్ కోణాన్ని పట్టించుకోవడం లేదు. ఒక వీకెండ్లో మామూలుగా నాలుగు క్రేజున్న సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే చాలా కష్టం అవుతుంది. 2016లో ఇలాగే సంక్రాంతికి నాలుగు పేరున్న సినిమాలు వస్తేనే థియేటర్ల సర్దుబాటుకు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఈసారి ఐదు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఐదు రేసులో నిలిచాయి అంటే థియేటర్లు మామూలు రోజుల్లో దక్కే దానికంటే చాలావరకు తగ్గి పోతాయి.

ఈ పరిస్థితుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాకు ఆటోమేటిగ్గా థియేటర్లు పెరుగుతాయి. అదే సమయంలో టాక్ బాలేని సినిమాకు ఉన్న థియేటర్లో కూడా తగ్గిపోతాయి. ప్రేక్షకులకు కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టాక్ బాలేని సినిమా వైపు అసలు చూడరు. కాబట్టి ఆ సినిమా పూర్తిగా అన్యాయం అయిపోతుంది. ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి ఇలాగే వాష్ అవుట్ అయిపోయాయి. తమ సినిమాల పట్ల అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ.. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. సంక్రాంతి రేసులోకి దిగితే మంచిది.