విజయ్ కాంత్ గొప్పదనం అది

తమిళ లెజెండరీ హీరోల్లో ఒకరైన విజయకాంత్ ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 80, 90 దశకాల్లో మాస్ యాక్షన్ సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన హీరో విజయ్ కాంత్. కెప్టెన్ ప్రభాకర్ లాంటి కొన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి ఘన విజయం సాధించాయి.

వానత్తై పోల (మా అన్నయ్య), రమణ (ఠాగూర్) లాంటి మెగా హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న విజయ్ కాంత్ కు గొప్ప మానవత వాదిగానూ పేరు ఉంది. ఆయన కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేశారు. తాను చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలకు విజయకాంత్ స్ఫూర్తి అని హీరో విశాల్ సైతం చెప్పడం గమనార్హం.

ఇక తమిళ ఇండస్ట్రీలో విజయకాంత్ గురించి ప్రత్యేకంగా అందరూ కొనియాడే విషయం ఒకటి ఉంది. ఇండస్ట్రీలో కింది స్థాయి నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ నాణ్యమైన భోజనం అందేలా చేయడంలో విజయకాంత్ పాత్ర కీలకం. విజయ్ కాంత్ సహాయ నటుడిగా సినిమాలు చేస్తున్న సమయంలో ఒక షూటింగ్ స్పాట్లో భోజనం చేస్తుండగా.. హీరో వచ్చాడని ఆయన్ని లేపి తీసుకెళ్లిపోయారట.

ఆ సంఘటనతో చిన్న ఆర్టిస్టులను కనీసం భోజనం కూడా చేయనివ్వరా అని తాను చాలా ఆవేదన చెందానని.. అప్పుడే సినిమా యూనిట్లో ప్రతి ఒక్కరికి మంచి భోజనం అందించాలని నిర్ణయించుకున్నానని.. తాను హీరోగా నిలదొక్కుకును రౌద్రన్ ఫిలిమ్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పాక.. తాను ఏం తింటే యూనిట్లో ప్రతి ఒక్కరూ అదే తినేలా రూల్ పెట్టానని.. అంతకు ముందులా నాసిరకంది కాకుండా నాణ్యమైన భోజనం పెట్టడం మొదలు పెట్టానని.. అప్పటినుంచి ఇండస్ట్రీ మొత్తంలో మార్పు వచ్చిందని గతంలో ఒక ఇంటర్వ్యూలో విజయ్ కాంత్ చెప్పాడు. విజయ్ కాంత్ చెప్పిన మాటలు అతిశయోక్తి ఏమీ కాదు. ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు మంచి భోజనం అందేలా చేయడంలో విజయ్ కాంత్ పాత్ర కీలకం అని కోలీవుడ్లో ఎప్పటి నుంచో పేరుంది.