అంచనాల బరువు పెంచుకో డెవిల్

చేతిలో మంచి కంటెంట్ ఉంటే సరిపోని ట్రెండ్ ఇది. మార్కెటింగ్, ప్రమోషన్ అంటూ సవాలక్ష వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. ఇంకో మూడు రోజుల్లో డెవిల్ విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నిర్మాత కం దర్శకుడు అభిషేక్ నామా చివరి నిమిషం వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉన్నాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ డేట్స్ సమస్య వల్ల ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. యానిమల్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తనవంతుగా అంచనాలు పెంచేలా ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ జోష్ ఇంకా సరిపోవడం లేదు. డిసెంబర్ రెండో వారంలో విడుదల తేదీని లాక్ చేసుకోవడంతో చేతిలో ఉన్న రెండు వారాల తక్కువ వ్యవధి డెవిల్ టీమ్ కి సరిపోవడం లేదు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. దిల్ రాజు థియేట్రికల్ రిలీజ్ కు అండగా ఉండటంతో మంచి థియేటర్లు దక్కబోతున్నాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. బింబిసార టైంలో కనిపించిన బజ్ అమిగోస్ వల్ల అమాంతం పోలేదు కాబట్టి కళ్యాణ్ రామ్ మీదున్న సాఫ్ట్ కార్నర్ మొదటి రోజు జనాన్ని థియేటర్లను రప్పిస్తుంది కానీ భారీగా అయితే కాదు.

జనవరి 11 దాకా మాత్రమే ఫ్రీ గ్రౌండ్ ఉంటుంది కనక డెవిల్ కి పధ్నాలుగు రోజులు కీలకం కాబోతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ వైపు అడుగులు పెట్టేయొచ్చు. దర్శకుడు మారడం గురించి కళ్యాణ్ రామ్ వద్ద ప్రస్తావిస్తున్నా అది అభిషేక్ నే అడగాలంటూ స్మార్ట్ గా తప్పించుకుంటున్నాడు కానీ ఇప్పటికీ ఆ తెరవెనుక కథేంటో బయటికి రావడం లేదు. బ్రిటిషర్ల పాలనలో జరిగిన ఒక పెద్దింటి హత్య కేసును ఛేదించే సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఇందులో విభిన్నమైన పాత్ర పోషించాడు. 2023ని సూపర్ హిట్ తో గ్రాండ్ గా ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం.