బాలీవుడ్‌ను ఏలిన సౌత్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే… అందులో ముందు వరుసలో ఉండే పేరు రామ్ గోపాల్ వర్మదే. ఈ విషయంలో ఆయనకు పోటీ వచ్చే ఇంకో డైరెక్టర్ కనిపించరు. దశాబ్దానికి పైగా బాలీవుడ్లో ఆయన తిరుగులేని ఆధిపత్యం చలాయించారు. దర్శకుడిగానే కాక నిర్మాతగానూ ఆయన ఒక కొత్త ఒరవడి సృష్టించారు బాలీవుడ్లో. వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను మరికొందరు తెలుగు దర్శకులు బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ.. పెద్దగా ఫలితం లేకపోయింది.
ఐతే సందీప్ రెడ్డి వంగ మాత్రం హిందీ సినిమా మీద చెరగని ముద్ర వేస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ హిందీలో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందా చిత్రం. ఐతే అది ఫ్లూక్ హిట్ అనుకున్న వాళ్లకు ‘యానిమల్’తో దిమ్మదిరిగే సమాధానం చెప్పాడు సందీప్. ఈ సినిమాకు వచ్చిన ప్రి రిలీజ్ హైప్, జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, అది సాధించిన ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు చూసి బాలీవుడ్ జనాలకు దిమ్మదిరిగిపోయింది. అందరి అంచనాలను మించిపోయిన ఈ చిత్రం ఏకంగా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి.. బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఒక దక్షిణాది దర్శకుడు హిందీలో ఈ స్థాయిలో ఆధిపత్యం చెలాయించడం అరుదైన విషయం. రణబీర్ బాలీవుడ్లో పెద్ద స్టార్ అయినప్పటికీ.. అతడి గత సినిమాలు వేటికీ రాని హైప్ ‘యానిమల్’కు వచ్చింది. క్రెడిట్ మొత్తం సందీప్ రెడ్డిదే. సందీప్ ఒక బ్రాండ్ గా మారి అతని కోసమే మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాకి వెళ్లారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇండియాలో రాజమౌళి తర్వాత ఇలాంటి ఇమేజ్ సంపాదించింది సందీపే. ఒక హిందీ డబ్బింగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటలకు షోలు వేశారు, అవన్నీ అడ్వాన్స్ ఫుల్స్ పడ్డాయి అంటే దీన్ని బట్టే సందీప్ రెడ్డి బ్రాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
యానిమల్ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావస్తుండగా.. ఈ సినిమా ద్వారా సందీప్ రెడ్డి సాధించిన ఆదాయం గురించి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో ఏకంగా 200 కోట్లు జేబులో వేసుకున్నాడట సందీప్. కబీర్ సింగ్ లాగే యానిమల్ కు కూడా అతను నిర్మాణ భాగస్వామి. కబీర్ సింగ్ ఆదాయాన్ని ఇందులో పెట్టుబడి పెట్టాడు. దీంతోపాటు దర్శకుడిగా పారితోషకం తీసుకోకుండా వాటా పుచ్చుకున్నాడు. ఇలా రెండు రకాలుగా అతడికి యానిమల్ సినిమా ద్వారా 200 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. హీరో రణబీర్ కపూర్ ఈ సినిమాకు 70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా.. దర్శకుడు, నిర్మాణం భాగస్వామి అయిన సందీప్ ఏకంగా అతనికంటే మూడు రెట్లు ఆదాయం సాధించినట్లు సమాచారం. యానిమల్ సెన్సేషనల్ హిట్ కావడంలో మేజర్ క్రెడిట్ తనదే కాబట్టి సందీప్ ఈ స్థాయిలో ఆదాయం అందుకోవడానికి అర్హుడే.