లేడీ విలన్ మంచి ఛాన్సులే పడుతోంది

శ్రేయా రెడ్డి అంటే ఇప్పటివాళ్లకు వెంటనే గుర్తు రాకపోవచ్చు కానీ విశాల్ పొగరులో లేడీ విలన్ గా బెదరగొట్టిన అమ్మాయంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. తర్వాత ఈవిడే విశాల్ అన్నయ్య విక్రమ్ ని పెళ్లి చేసుకుని గృహిణిగా మారిపోయింది. నిజానికి తన డెబ్యూ తెలుగులోనే జరిగింది. చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో రాజా హీరోగా 2003లో విడుదలైన అప్పుడప్పుడు తన ఫస్ట్ మూవీ. ఆశించిన ఫలితం అందకపోవడంతో పాటు టాలీవుడ్ డిమాండ్ చేసే స్కిన్ టోన్ కు భిన్నంగా నలుపు వర్ణం కావడంతో అవకాశాలు రాలేదు. అమ్మ చెప్పింది కూడా ఫ్లాప్ బాపతులోకి చేరింది.

తిరిగి ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత శ్రేయ రెడ్డికి ఆఫర్లొస్తున్నాయి. ఇవాళ రిలీజైన ప్రభాస్ సలార్ లో జగపతి బాబు కూతురిగా చెప్పుకోదగ్గ స్పేస్ దొరికింది. కథ పరంగా పాత్ర బ్రతికే ఉంది కాబట్టి రెండో భాగంలో ప్రాధాన్యం ఇంకా పెరగనుంది. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం సునామి వసూళ్లతో దూసుకుపోతున్న సలార్ తర్వాత శ్రేయ రెడ్డి చేస్తున్న మరో సినిమా పవన్ కళ్యాణ్ ఓజి. ఇందులో కూడా ప్రాముఖ్యం ఉన్న పాత్రే దర్శకుడు సుజిత్ ఇచ్చాడని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వీటికన్నా ముందు ప్రైమ్ లో వచ్చిన సుజల్ వెబ్ సిరీస్ మంచి పాపులారిటీ తెచ్చింది.

ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ అయితే శ్రేయ రెడ్డి దశ తిరిగినట్టే. ఎందుకంటే ప్రస్తుతం లేడీ ఆర్టిస్టుల కొరత చాలా ఉంది. అందులోనూ నెగటివ్ షేడ్స్ ఇంత బాగా పలికించే వాళ్ళు దొరకడం కష్టం. అయితే ఈవిడ అన్ని కథలను ఒప్పుకోదట. బాగా నచ్చితే తప్ప అంగీకరించదనే పేరుండటంతో దర్శకులు పెద్దగా కలవడం లేదని చెన్నై టాక్. సరే ఇప్పటికైనా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కెరీర్ ని సెటిల్ చేసుకోవచ్చు. సలార్ లో ఈశ్వరిరావు, ఝాన్సీలకన్నా ఎక్కువ శ్రేయ రెడ్డినే హైలైట్ కావడం తనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.