చిచ్చు పెట్టిన కుటుంబ నియంత్రణ ‘సర్కారు నౌకరి’

గాయని సునీత వారసుడు ఆకాష్ గోపరాజు నటుడిగా పరిచయమవుతున్న సినిమా సర్కారు నౌకరి. దీంతో పాటు మరో విశేషం ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దీనికి నిర్మాతగా వ్యవహరించడం. సలార్ వచ్చిన వారానికే నూతన సంవత్సర కానుకగా జనవరి 1 విడుదల చేయబోతున్నారు. శేఖర్ గంగనమోని దర్శకుడు. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. బలగం నుంచి చిన్న సినిమాలు సైతం థియేట్రికల్ రిలీజ్ చేసుకుని అద్భుతాలు చేయొచ్చని ఋజువయ్యాక అందరూ అదే బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు నౌకరి కూడా అలాంటి జానరే అనిపిస్తోంది. కథేంటో చెప్పేశారు.

తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరికి ఆరోగ్య శాఖ ఉద్యోగిగా వస్తాడు గోపాల్(ఆకాష్ గోపరాజు). కొత్తగా పెళ్లైన భార్య(భావన)తో ఊళ్ళో జనం సకల మర్యాదలు ఇస్తుంటారు. కల్లా కపటం తెలియని ఆ ఊరికి జనాభా నియంత్రణ గురించి చెప్పాల్సిన బాధ్యత గోపాల్ కు అప్పగిస్తుంది ప్రభుత్వం. దీంతో కండోమ్స్ తీసుకుని వాటి వాడకం పట్ల గ్రామస్థులను చైతన్య పరిచేందుకు పూనుకుంటాడు. కానీ అనూహ్యంగా ఇది అతని కాపురంలో కలతలు రేపడమే కాక జనంతో చీవాట్లు తినేలా చేస్తుంది. ఇంత చిక్కుల్లో పడినా డ్యూటీనే ప్రాణంగా భావించే గోపాల్ చివరికి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే స్టోరీ.

పాయింట్ అయితే డిఫరెంట్ గా ఉంది. పూర్తిగా విలేజ్ డ్రాప్ లో కామెడీ, భావోద్వేగాలు రెండింటిని జొప్పించాడు దర్శకుడు శేఖర్. విజువల్స్ గట్రా నీట్ గా ఉన్నాయి. సెన్సిటివ్ విషయాన్ని హ్యాండిల్ చేసిన విధానం కన్విన్సింగ్ గానే అనిపిస్తోంది. శాండిల్య సంగీతం సమకూర్చగా సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సర్పంచి పాత్రలో తనికెళ్ళ భరణి లాంటి సీనియర్లను తీసుకోవడం బాగుంది. ఆకాష్ లుక్స్, నటన బాగానే ఉన్నాయి. కళ్యాణ్ రామ్ డెవిల్, రోషన్ కనకాల బబుల్ గమ్ వచ్చిన నాలుగో రోజే సర్కారు నౌకరీ థియేటర్లలో అడుగు పెట్టనుంది. కనెక్ట్ అయితే మంచి కంటెంటే.