స్టార్ హీరో లేకపోయినా కంటెంట్ నమ్ముకుని సంక్రాంతి బరిలో దిగుతున్న సినిమా హనుమాన్. అ!, కల్కి, జాంబీ రెడ్డి లాంటి డిఫరెంట్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రైమ్ షో సంస్థ దీన్ని నిర్మించింది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో రామభక్త హనుమంతుడిని వర్తమానంలోని ప్రపంచానికి ముడిపెడుతూ ఏదో సరికొత్త ప్రయత్నం చేశారనే అభిప్రాయం టీజర్, పోస్టర్లు చూసినప్పుడు అనిపించింది. ఇవాళ ఏపీ, తెలంగాణలోని ప్రముఖ కేంద్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల ట్రైలర్ లాంచ్ ని ఘనంగా నిర్వహించారు.
అంజనాద్రి అనే కొండప్రాంతంలో కల్లాకపటం తెలియని ఒక మాములు యువకుడు హనుమ(తేజ సజ్జ). అతనికి ఉన్న అతీత శక్తుల గురించి ఎవరికీ తెలియదు. అక్కే(వరలక్ష్మి శరత్ కుమార్) లోకంగా బ్రతుకుతూ ఉంటాడు. వినాశనం ద్వారా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న ఓ దుర్మార్గుడు(వినయ్ రాయ్) హనుమ గురించి తెలుసుకుని తన మనుషులను దాడి చేసేందుకు పంపిస్తాడు. భయపడినట్టే హనుమ తీవ్రంగా గాయపడి సముద్ర గర్భంలో పడిపోతాడు. నిజమైన అంజనీ పుత్రుడి సహాయంతో బయటికి వచ్చి శత్రు మూకల భరతం పట్టేందుకు పూనుకుంటాడు.
అంచనాలకు మించి దర్శకుడు ప్రశాంత్ వర్మ విజువల్స్ తో కట్టిపడేసాడు. రొటీన్ గా చూసే కమర్షియల్ ఫ్లేవర్ కి భిన్నంగా సరికొత్త ఫాంటసీలోకి తీసుకెళ్లిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్ వాడిన వైనం గొప్పగా వచ్చాయి. స్టోరీపరంగా కాకుండా ప్రెజెంటేషన్ తో ఆకట్టుకునేలా ఉంది. గౌరహరి-అనుదీప్ దేవ్-కృష్ణ సౌరభ్ సంగీతం సమకూర్చగా, శివేంద్ర ఛాయాగ్రహణం మరో లోకంలోకి తీసుకెళ్లింది. సంక్రాంతి బరిలో దిగేందుకు తనకు పూర్తి అర్హత ఉందని నిరూపించుకునేందుకు ట్రైలర్ చక్కగా ఉపయోగపడేలా ఉంది. జనవరి 12 రిలీజ్ కాబోతున్న హనుమాన్ పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా లాగేసేలా ఉంది