శ్రీనువైట్ల.. ఒక ఐదేళ్ల ముందు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల దాకా పారితోషకం తీసుకునే రేేంజిలో ఉన్నాడాయన. కానీ ఆయన జాతకం తిరగబడటానికి ఎంతో కాలం పట్టలేదు. ‘బాద్ షా’ వరకు బాగా నడిచిన ఆయన బండికి.. ఆ సినిమా తర్వాత బ్రేకులు పడ్డాయి.
‘దూకుడు’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇచ్చాక మహేష్ బాబుతో రెండోసారి ఆయన తీసిన ‘ఆగడు’ అప్పటికి టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. సినిమా సినిమాకూ వైట్ల పేరు దెబ్బ తింటూ వచ్చింది. ఇండస్ట్రీలో ఆయన పేరు చెబితే హీరోలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. మీడియం రేంజ్ హీరోలు కూడా వైట్లతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. దీంతో రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్నాడాయన.
ఎట్టకేలకు మంచు విష్ణు.. వైట్లతో సినిమా చేసేందుకు ముందుకొచ్చాడని కొన్ని నెలల కిందట వార్తలొచ్చాయి. వీళ్లిద్దరి కలయికలో ఇంతకుముందు ‘ఢీ’ లాంటి బ్లాక్‌బస్టర్ వచ్చింది. ఆ తర్వాత వైట్ల రేంజ్ మారిపోయి బడా స్టార్లతోనే సినిమాలు చేశాడు. ఇప్పుడు కష్ట కాలంలో మంచు విష్ణు ఓకే అన్నా సినిమా చేసుకుందామనే ఆశతో ఉన్నాడు.
ఆ మధ్య ‘ఢీ’ వార్షికోత్సవం సందర్భంగా వైట్ల, విష్ణు ఇద్దరూ దాని సీక్వెల్ గురించి సంకేతాలిచ్చాడు. తన రైటింగ్ టీంతో కలిసి వైట్ల స్క్రిప్టు కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఐతే విష్ణు ఇప్పుడు ఆ సినిమా చేసే విషయంలో తటపటాయిస్తున్నాడట. కరోనా దెబ్బకు మంచి ఫ్యామిలీ వారి విద్యా సంస్థలు కొంత ఇబ్బందుల్లో పడ్డాయి.
ఆస్తులకు లోటు లేకపోయినా క్యాష్‌కు కటకట వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ పూర్తయిన ‘మోసగాళ్లు’ సినిమాను బయటికి తేవడమే కష్టంగా ఉంది. దాని సంగతి తేలకుండా ‘ఢీ’ సీక్వెల్‌ను మొదలుపెట్టే పరిస్థితుల్లో లేడట విష్ణు. దీంతో ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కన పెట్టినట్లే అంటున్నారు. విష్ణునే వెనక్కి తగ్గాడంటే వైట్లకు ఈ స్థితిలో ఇంకో హీరోను పట్టుకోవడం, సరైన స్క్రిప్టు రెడీ చేసుకుని, నిర్మాతను వెతుక్కుని సినిమా చేయడం కష్టమే.