బలమేంటో తెలుసుకున్న నాగార్జున

సంక్రాంతి సినిమాల్లో లేట్ ఎంట్రీ ఇచ్చినా ప్రమోషనల్ కంటెంట్ తో ఒక్కసారిగా తన మీద దృష్టి వచ్చేలా చేసుకున్న నా సామిరంగ క్రమంగా అంచనాలు పెంచుకుంటోంది. ముఖ్యంగా నాగార్జున ఊర మాస్ అవతారం చూసి ఫ్యాన్స్ లో కదలిక వచ్చింది. అక్కినేని ఫ్యామిలీని గత కొంత కాలంగా శాపంలా వెంటాడుతున్న ఫ్లాపుల నుంచి అర్జెంట్ గా ఉపశమనం కావాలంటే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టకపోయినా కమర్షియల్ గా ఒక పెద్ద సూపర్ హిట్ దక్కితే చాలు. ఆ లక్షణాలు నా సామిరంగలో ఉన్నాయని టీజర్, పాట చూశాక ఒక అవగాహన వచ్చినట్టు ఉంది.

నిజానికి చిరంజీవి, బాలకృష్ణ లాగే నాగార్జున సైతం లేట్ ఏజ్ మాస్ పాత్రలకు నప్పుతాడు. వాళ్లేమో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి హిట్లు కొడుతుంటే నాగ్ మాత్రం వైల్డ్ డాగ్, ఘోస్ట్ అంటూ సామాన్య జనాలకు చేరలేని యాక్షన్ డ్రామాలు ఎంచుకుని పొరపాట్లు చేశాడు. వారసులు అఖిల్, నాగ చైతన్యలు సైతం ఛాయస్ లు తప్పుగా ఎంచుకోవడంతో ఏజెంట్, కస్టడీ, లాల్ సింగ్ చద్దా, థాంక్ యు ఒకటేమిటి అన్నీ టపా కట్టినవే. దూతకు మంచి స్పందన వచ్చినా అది హారర్ వెబ్ సిరీస్ కావడం, లెక్కలు వేసేందుకు వ్యూస్ తప్ప కాసులు కనిపించే అవకాశం లేకపోవడం కట్టడి చేసింది.

సో గుంటూరు కారం తర్వాత తనదే ఛాయస్ అనిపించేందుకు నా సామిరంగ బృందం చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి. కేవలం నాగార్జునని హైలైట్ చేయకుండా అల్లరి నరేష్ కు తగిన ప్రాధాన్యం ఇచ్చి టీజర్లలో చూపించడం ప్రేక్షకులను మరింత దగ్గర చేస్తోంది. షూటింగ్ మొదలుపెట్టుకోవడంలో విపరీత జాప్యం జరిగినా పూర్తి చేయడంలో మాత్రం విపరీతమైన వేగం చూపిస్తున్న నా సామిరంగ రిలీజ్ డేట్ వ్యవహారమే ఎటూ తేలడం లేదు. జనవరి 11 లోపే రావాలని ఒక ఆప్షన్, చివరిగా జనవరి 14 వస్తే ఎలా ఉంటుందన్న మరో ఆప్షన్ రెండింటి మీద సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి.