గద్దలకొండ గణేష్ లాంటి మంచి హిట్ ఇచ్చిన తర్వాత నాలుగేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాడు హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అవ్వడంతో అది ఎంత ఆలస్యమైనా అతను పక్క చూపులు చూడలేదు. అసలు సినిమా సెట్స్ మీదకే వెళ్లకపోయినా.. అతను పవన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక దశలో పవన్ సినిమా మీద పూర్తిగా ఆశలు కోల్పోయినప్పటికీ హరీష్ మారలేదు. ఈ ప్రాజెక్టు ఎంత ఆలస్యమైనా సరే పక్కకు వెళ్లే అవకాశం ఏ లేదని సంకేతాలు ఇచ్చాడు. ఆ మాటకు కట్టుబడే ఉస్తాద్ భగత్ సింగ్ ను పట్టాలెక్కించి కొంత షూటింగ్ జరిగే వరకూ హరీష్ పట్టుదల వీడలేదు. అయితే ఈ సినిమా షెడ్యూళ్లు కొన్ని జరిగాక అనివార్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యాడు.
ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు మళ్లీ ఉస్తాద్ కోసం డేట్లు ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో హరీష్ శంకర్ పంతం తప్పలేదు. రవితేజతో వేగంగా ఒక రీమేక్ మూవీ చేయడానికి అతడికి కాంట్రాక్టు కుదిరింది. హిందీ రైడ్ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ఈరోజే ప్రారంభోత్సవం జరుపుకుంది.
మొత్తానికి హరీష్ శంకర్ ఉస్తాద్ తిరిగి పట్టాలెక్కేలోపు ఒక సినిమా లాగించేయబోతున్నాడు. అయితే పవన్ తో సినిమాలు చేస్తూ మధ్యలో ఖాళీ అయిన ఇంకో ఇద్దరు దర్శకులు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ ఇద్దరే క్రిష్, సుజిత్. దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సంగతి అటు ఇటు తేలకుండా ఉంది. ఆ చిత్ర షూటింగ్ సుదీర్ఘకాలంగా వాయిదా పడుతుంది. అందువల్ల ఇప్పటికే చాలా సమయం వృథా చేసుకున్నాడు క్రిష్.
పవన్ రాజకీయాల నుంచి ఫ్రీ అయ్యి మళ్ళీ సినిమాలకు అందుబాటులోకి వచ్చినా.. తన ప్రయారిటీ హరిహర వీరమల్లు కాకపోవచ్చు. అది పునః ప్రారంభం కావడానికి, పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో హరీష్ లాగే క్రిష్ సైతం మధ్యలో ఇంకో సినిమా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకు పవన్ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు. అయితే సుజిత్ మాత్రం వేరే సినిమా వైపు చూసే అవకాశాలు తక్కువే. అతడి ఓజీ చాలా వరకు పూర్తయింది. అతను ఎడిటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పవన్ తిరిగి అందుబాటులోకి రాగానే ఓజీనే ముందుగా పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సుజిత్ కు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ క్రిష్ మాత్రం హరీష్ బాట పడితేనే మంచిదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates