ప్రశాంత్ నీల్ కథతో సలార్ నిర్మాతల ‘బఘీరా’

కెజిఎఫ్, సలార్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కథతో హోంబాలే ఫిలింస్ మరో భారీ చిత్రాన్ని నిర్మించింది. పేరు బఘీరా. ఇందులో శ్రీమురళి హీరో. ప్రత్యేకంగా ఇతనితోనే కాంబినేషన్ సెట్ చేయడానికి కారణం ఉంది. నీల్ మొదటి సినిమా ఉగ్రం హీరో ఇతనే. ఇద్దరికీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ కలయిక తర్వాత మరో చిత్రం చేయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ కుదరలేదు. ఒకదశలో శ్రీమురళిని కెజిఎఫ్ కోసం లుక్ టెస్ట్ చేశారు కానీ కుదరకపోవడంతో అది కాస్తా యష్ ని వరించి అతన్ని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఆ లోటలా ఉండిపోయింది.

అందుకే శ్రీమురళి కోసం మరో పవర్ ఫుల్ సబ్జెక్టుని సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్ దాన్ని భారీ బడ్జెట్ తో హోంబాలేలోనే నిర్మాణం జరిగేలా చూసుకున్నాడు. దర్శకత్వ బాధ్యతలు సూరికి ఇచ్చారు. షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవాళ టీజర్ లాంచ్ చేశారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే టైటిల్ కనిపించింది కానీ దీన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. నగరమే అడవిగా మారి మనుషులు జంతువులుగా మారినప్పుడు వాటిని వేటాడ్డం కోసం ఒకడొస్తాడు. అతనే బఘీరా. మొహం కనిపించకుండా విరుచుకుపడే ఇతని కత్తికి దుర్మార్గుల తలలు తెగుతాయి.

విజువల్స్ గట్రా చూస్తుంటే ఇది కూడా యాక్షన్ డ్రామాని అర్థమైపోయింది. సంగీతం రవి బస్రూర్ కి ఇవ్వలేదు. విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ కు ఆ బాధ్యతను అప్పగించారు. సప్తసాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ బఘీరాలో హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, రంగనాయన రఘు ఇతర తారాగణం. కెజిఎఫ్, సలార్ లతో తమ మార్కెట్ రేంజ్ ని అమాంతం పెంచుకున్న హోంబాలేకి ఈ బఘీరా ప్రమోషన్ల పరంగా పెద్ద టెన్షన్ లేదు. శ్రీమురళికి ఇతర భాషల్లో ఇమేజ్ లేకపోయినా ప్రొడక్షన్ బ్యానర్ బ్రాండ్ ఇమేజే పెద్ద అండగా నిలవబోతోంది.