ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. అర్ధరాత్రి షోలు ఉంటాయని చెబుతున్నారు కానీ వాటికి ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు వదిలిన జిఓ బయట కనిపించడం లేదు. అయినా సరే బెనిఫిట్ షోల టికెట్ల కోసం ఓ రేంజ్ లో పైరవీలు మొదలైపోయాయి. పంపిణి హక్కులు తీసుకున్న మైత్రి ఆఫీస్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ల హడావిడే కాకుండా మల్టీప్లెక్సుల మేనేజర్లు, సింగల్ స్క్రీన్ల యజమానులు కనిపించడమే దీనికి సాక్ష్యం. ఏ షోలకు ఎన్నేసి టికెట్లు కావాలనే సమాచారాన్ని ముందుగానే తీసుకుని ఆ మేరకు బ్లాక్ చేసి పెట్టేందుకు రెడీ అవుతున్నారట.
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భీమవరంలో స్పెషల్ షో టికెట్ బ్లాక్ లో మూడు వేల రూపాయలపైనే అమ్మోచ్చనే వార్త సంచలనం రేపుతోంది. వైజాగ్, గుంటూరు, విజయవాడలో థియేటర్ ఓనర్లకు ఎమ్మెల్యే, మంత్రి రేంజ్ లో ఫోన్ కాల్స్ వస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టికెట్ రేట్ల పెంపు గురించి ధృవీకరణ వచ్చాక ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. వీటిలో ప్రీమియర్లు ముందే సోల్డ్ అవుట్ పెట్టేస్తారు కాబట్టి వాటి మీద పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు. అవి కావాలంటే బయట తీసుకోవాల్సిందే.
గంటలు గడిచే కొద్దీ ఈ ట్రెండ్ ఉధృతంగా మారుతోంది. పైగా ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా వినిపించడం, ప్రభాస్ టీమ్ తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ తాలూకు సంగతులు ఎగ్జైట్ మెంట్ పెంచడం లాంటి కారణాలు హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. రెండో ట్రైలర్ వదలాలా వద్దా అనే విషయంలో హోంబాలే మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడబోతున్న ప్రశాంత్ నీల్ కొత్తగా ఏం చెబుతాడాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు టికెట్ దొరకడమంటే అదేదో వరల్డ్ కప్ గెలిచే రేంజ్ లో హడావిడి జరుగుతోంది.