నిన్న విడుదలైన గుంటూరు కారం ఓ మై బేబీ పాట గురించి రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా గీత రచయిత రామజోగయ్య శాస్త్రి స్పందించారు. ఎక్స్ వేదికగా ఘాటు వార్నింగ్ ఇచ్చేశారు. ముందు అదేంటో చూద్దాం. “ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరే వాడే. అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని. మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా, అదే లేకపోతే,ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం,తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి”. ఇది ట్విట్టర్లో ఆయన పూర్తి సందేశం.
సినిమా అయినా పాట అయినా ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చాక పాజిటివ్ నెగటివ్ రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఎవరూ కావాలని ఫ్లాపయ్యే కంటెంట్ రాయరు, తీయరు. ఇది జగమెరిగిన సత్యం. ఏం తక్కువయ్యిందని రివర్స్ లో ప్రశ్నిస్తే బోలెడు కౌంటర్లు వచ్చి పడతాయి. ప్రేమించే పని చేయడం అన్ని వృత్తుల్లో ఉన్నదే. దాన్ని మళ్ళీ నొక్కి చెప్పాల్సిన పని లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని రెచ్చగొడితే ఊరికే ఉండే రకం కాదు ట్విట్టర్ బ్యాచ్. ఒరిజినల్ ఐడి లేకుండా ఫేక్ పేర్లతో దందా నడిపే వాళ్ళకు వార్నింగ్ ఇస్తే అది బూమరాంగ్ అయిపోయి బిపి పెంచే రిస్క్ ఉంది.
ఏదైతేనేం మొత్తానికి రామజోగయ్య శాస్త్రి తన మీద వచ్చిన కామెంట్లను సీరియస్ గా తీసుకున్నారని అర్థమవుతోంది. ఇక్కడ ఆయన రాసింది రైటా రాంగా అనేది పక్కన పెడితే లిరిక్స్ ఓకే చేసే బాధ్యత ముందు దర్శకుడు, హీరోల మీద ఉంటుంది. ఒకవేళ వాళ్లకు నచ్చపోతే కొత్త వెర్షన్లు రాస్తారు. ఇది వేటూరి కాలం నుంచి అనంతశ్రీరామ్ దాకా అందరూ ఫాలో అయ్యేదే. సరే ఈయన కామెంట్లకు స్పందిస్తూ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు లాజికల్ గానూ సమాధానం చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఊరుకుంటే పోయే రచ్చ మీద శాస్త్రి గారు రాయి వేసినట్టే అయ్యింది