నందమూరి కుటుంబం నుంచి వచ్చినా ప్రయోగాలు చేయడంలో ముందుండే కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసార రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాక ఈ సంవత్సరం అమిగోస్ రూపంలో ట్రిపుల్ యాక్షన్ చేసి స్పీడ్ బ్రేకర్ వేసుకున్నాడు. ఈసారి డెవిల్ గా పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారి డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్న మూవీ ఇది. తొలుత నవీన్ మేడారం పేరుతో మొదలై తర్వాత చేతులు మారింది. ఇవాళ హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. కథా కమామీషు తాలూకు అంశాలను రివీల్ చేశారు.
అది స్వాతంత్రం రాకముందు ఇండియాని బ్రిటిషర్లు పాలిస్తున్న కాలం. వాళ్ళ తరఫున సీక్రెట్ ఏజెంట్ గా పని చేస్తుంటాడు డెవిల్(కళ్యాణ్ రామ్). ఓ పెద్ద సంస్థానానికి చెందిన అమ్మాయి హత్యకు గురి కావడంతో ఆ కేసుని ఛేదించడానికి డెవిల్ ని నియమిస్తుంది ప్రభుత్వం. అయితే లోతుగా నిజాలను తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. అంతు చిక్కని రహస్యాలను ఛేదించేందుకు ఆపరేషన్ టైగర్ హంట్ అనే మరో బాధ్యతను తీసుకుంటాడు.ఈ చక్రవ్యూహంలో ప్రియురాలు (సంయుక్త మీనన్) కూడా ఉంటుంది. చివరికి డెవిల్ ప్రయాణం ఏమయ్యిందో తెరమీద చూడాలి.
ఊహించిన దానికన్నా గ్రాండ్ విజువల్స్ తో దర్శకుడు అభిషేక్ నామా కట్టిపడేసారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించిన తీరు చాలా బాగా కనిపిస్తోంది. ఆర్ట్ వర్క్, హర్షవర్ధన్ రామేశ్వర్ బిజిఎం, సౌందర్ రాజన్ కెమెరా వర్క్ ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. శ్రీకాంత్ విస్సా రచనలో వైవిధ్యం ఉంది. కళ్యాణ్ రామ్ సీరియస్ గా కనిపించే డెవిల్ గా పూర్తిగా ఒదిగిపోయాడు. సీత, అజయ్, షఫీ, శ్రీకాంత్ అయ్యంగార్ లతో పాటు మరో కీలక పాత్ర మాళవిక నాయర్ డిఫరెంట్ గా చేసింది. డిసెంబర్ 29న థియేటర్లలో చూసేందుకు సరిపడా అంచనాలను ఈ ట్రైలర్ ద్వారా డెవిల్ పుష్కలంగా అందించేసింది.