రవితేజ కథ సన్నీడియోల్ చేతికి ?

కొన్ని వారాల క్రితం మైత్రి మూవీ మేకర్స్ అట్టహాసంగా ప్రకటించిన రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా హఠాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ వర్కౌట్ కాదనే సందేహంతోనే వద్దనుకున్నారనే వార్త గట్టిగానే తిరిగింది కానీ నిర్మాతల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. ఈలోగా తమిళ స్టార్ హీరో అజిత్ తో మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో ఇంకో ప్యాన్ ఇండియా మూవీ సెట్ చేసుకున్నారు. మరి కథ బాగా నచ్చి ముందు ఓకే అనుకున్న మాస్ మహారాజా ప్రాజెక్ట్ ఇప్పుడు అనూహ్యంగా చేతులు మారి బాలీవుడ్ వెళ్లిందట.

ఈ ఏడాది గదర్ 2 రూపంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి అందుకున్న సన్నీడియోల్ హీరోగా ఇదే స్టోరీని తెరకెక్కించేందుకు మైత్రి సిద్ధమయ్యిందని వినికిడి. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ప్రాధమికంగా ముంబైలో ఒక దఫా చర్చలు జరిగిపోయాయట. క్రాక్ తరహాలో మంచి పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో గోపిచంద్ తయారు చేసుకున్న స్క్రిప్ట్ వినగానే సన్నీ డియోల్ మెచ్చుకున్నట్టు తెలిసింది. హిందీలో భారీ ఎత్తున అడుగు పెట్టాలని చూస్తున మైత్రికి ఇది మంచి కాంబో అవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా సన్నీ మార్కెట్ పెరిగిపోవడంతో బిజినెస్ పరంగా ఢోకా లేదు.

ఒకవేళ ఇది నిజమైతే మాత్రం గోపిచంద్ కి మంచి బ్రేక్ అవుతుంది. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత సుమారు ఆరేడు నెలలు దీని మీదే వర్క్ చేశాడు. రవితేజ హ్యాట్రిక్ తర్వాత మరోసారి తన కలయికతో ఇంకో హిట్ ఇవ్వొచ్చనే నమ్మకంతో ఉన్నాడు. అయితే ఇప్పుడీ కాంబో మారిపోవడం ఒక రకంగా మంచిదే. సందీప్ రెడ్డి వంగా, ఆట్లీ తరహాలో నార్త్ హీరోల దృష్టిలో పడితే మార్కెట్ పెరుగుతుంది. టి సిరీస్, ధర్మా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థలు ఆఫర్లు ఇస్తాయి. కన్ఫర్మ్ అయితే మాత్రం క్యాస్టింగ్ తప్ప టెక్నికల్ టీమ్ మొత్తం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా ఉంటుంది.