కుటుంబాన్ని భయపెట్టే దెయ్యాల ‘పిండం’

ఒకప్పటిలా ఒళ్ళు జలదరింపజేసే సీరియస్ హారర్ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. అశ్విన్స్ లాంటి ఒకటి రెండు వచ్చినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 విడుదల కాబోతున్న పిండం మీద దెయ్యాల ప్రియులకు మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ అత్మల ట్రైలర్ ని ఇందాకా విడుదల చేశారు. మూడున్నర నిమిషాల పాటు ఉన్న వీడియోలో కథ తాలూకు తీరుతెన్నులతో పాటు అత్యంత భయపెట్టే చిత్రంగా వేసుకున్న ట్యాగ్ కి న్యాయం జరిగిందో లేదో సాంపిల్స్ చూపించారు.

సుక్లాపేట్ 1990లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా పిండం రూపొందింది. తక్కువ ధరకు మంచి వసతి దొరికిందన్న సంతోషంతో ఒక పాత ఇంట్లో చేరతాడు ఆంటోనీ(శ్రీరామ్). తల్లి, భార్య(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్ళతో చక్కని ఫ్యామిలీ ఇతనిది. అయితే మాటలు రాని ఆ పసి పిల్లలకు రాత్రిళ్ళు ఎవరో తమతో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. భయపెట్టే సంఘటనలు జరుగుతాయి. విషయం తెలుసుకోవడం కోసం మంత్రగత్తె(ఈశ్వరిరావు)ని పిలిపిస్తారు. ఆవిడ అక్కడ ఒకటి కాక మరెన్నో దెయ్యాలు ఉన్నట్టు గుర్తిస్తుంది. అమావాస్యకు ఒక విరుగుడు సిద్ధం చేస్తుంది.

విజువల్స్ అన్నీ సీరియస్ హారర్ తో నింపేశారు. ఆర్టిస్టులు తక్కువే అయినప్పటికీ భీతి గొలిపేలా డిజైన్ చేసిన సీన్లు ఆసక్తి రేపెలా ఉన్నాయి. దర్శకుడు సాయికిరణ్ ధైడా మరీ కొత్త కథను ఎంచుకోకపోయినా టేకింగ్ లో మాత్రం డెప్త్ ఉండేలా చూసుకుని భయపెట్టడమే లక్ష్యంగా చేసుకున్నాడు. దానికి సాంకేతిక బలం తోడవ్వడంతో ఇంటెన్స్ పెరిగింది. విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, మంగళవారం ఇలా హారర్ కం థ్రిల్లర్ మూవీస్ కి మంది ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ పిండం కూడా వీటితో జత కట్టేది లేనిది వచ్చే శుక్రవారం థియేటర్లలో చూశాక తేలనుంది.