నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గా చేశారు. తారాగణంతో సహా టీమ్ మొత్తం హాజరయ్యారు. ఇందులో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సతీ సమేతంగా జీవితతో పాటు విచ్చేశారు. నితిన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మరీ థాంక్స్ చెప్పాడు. అయితే ట్రైలర్ లో కేవలం ఒక్క షాట్లో మాత్రమే రాజశేఖర్ ని చూపించడంతో అసలు ఆయన పాత్ర నిడివి ఎంతనేది ఫ్యాన్స్ కి ఆతృతగా ఉంది. మొన్న శేఖర్ దాకా సోలో హీరోగానే చేస్తున్న యాంగ్రీ మ్యాన్ మొదటిసారి సపోర్టింగ్ రోల్ కి షిఫ్ట్ అయ్యి చేసిన మూవీ ఇది.
అలాంటప్పుడు ఆయన బ్రాండ్ ని వాడుకోవాలనేది అభిమానుల ప్రశ్న. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రాజశేఖర్ ఇందులో విలన్ కాదు. ప్రాముఖ్యత ఉంటుంది కానీ మరీ కథను మలుపు తిప్పేలా కాదని, సర్ప్రైజ్ అనిపించే నిడివితో గుర్తుండిపోయేలా దర్శకుడు వక్కంతం వంశీ డిజైన్ చేశారని అంటున్నారు. ఇదెంత వరకు నిజమో ఎనిమిదో తేదీ థియేటర్లో చూస్తే కానీ క్లారిటీ రాదు. రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశారు. గరుడవేగ తప్ప దానికి ముందు వెనుకా చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేవు. కల్కి అంత భారీ బడ్జెట్ తో నిర్మించినా బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది.
ఈ నేపథ్యంలో ఎక్స్ ట్రాడినరి మ్యాన్ విజయం సాధించడం చాలా కీలకం. ఒకవేళ ఈ క్యారెక్టర్ కనక క్లిక్ అయితే క్రమంగా ఇతర హీరోల కాంబినేషన్లతో ట్రై చేయొచ్చు. ఎలాగూ టాలీవుడ్ లో జగపతిబాబు, శ్రీకాంత్ లతో పాటు అంత క్యాలిబర్ ని మోసే ఆర్టిస్టుల అవసరం చాలా ఉంది. అది రాజశేఖర్ తో తీరితే మంచిదే. మరి ఈ టీమ్ ఎందుకు హైలైట్ చేయడం లేదో వేచి చూడాలి. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ కం కామెడీ ఎంటర్ టైనర్ మీద నితిన్ కాన్ఫిడెన్స్ మాములుగా లేదు. అంచనాలు లేకుండా వచ్చినా కాలర్ ఎగరేసుకుని మరీ వెళ్తారని హామీ ఇస్తున్నాడు.