ప్రపంచ బాక్సాఫీసులో యానిమల్ రికార్డు

రకరకాల టాకులు, రివ్యూలు, కామెంట్లు ఎన్ని వచ్చినా యానిమల్ ప్రభంజనం మాత్రం మాములుగా లేదు. విజయం పట్ల టీమ్ ముందు నుంచే నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ మరీ ఈ స్థాయిలో కాదన్నది వాస్తవం. తాజాగా ఈ వీకెండ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లతో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని అరుదైన రికార్డు సృష్టించింది. మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ ఏకంగా 42 మిలియన్ డాలర్లతో హాంగర్ గేమ్స్, నెపోలియన్ లను దాటేసి సింహాసనం మీద కూర్చుంది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఈ మొత్తం సుమారు 340 కోట్లకు పైగా తేలుతుంది. ఇది పెద్ద ఘనత.

గతంలో అతి కొద్ది భారతీయ సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. అయితే రన్బీర్ కపూర్ కు ఇది మొదటిసారి. బాలీవుడ్ లో తీసిన రెండో చిత్రానికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంత గొప్ప మైలురాయి అందుకోవడం విశేషం. ఈ జోరు ఇంకా కొనసాగేలా ఉంది. తెలుగులో హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు ఉన్నాయి కానీ ఇతర భాషల్లో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఏమి లేవు. ఒకరకంగా డంకీ వచ్చే దాకా ఓవర్సీస్ లో యానిమల్ కి అడ్డు అదుపు ఉండదు. రాణి ఔర్ రాఖీ కి ప్రేమ్ కహాని లాంటి యావరేజ్ మూవీకే రికార్డులు దక్కినప్పుడు ఇక రన్బీర్ వీరంగం గురించి చెప్పేదేముంది.

పఠాన్ తర్వాత మొదటి వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా యానిమల్ రెండో స్థానం దక్కించుకుంది. పది రోజుల్లోపే 500 కోట్ల మార్క్ చేరుకోవడం సులభంగానే కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఇండియాలో రెండు వందల యాభై కోట్లు, ఓవర్సీస్ లో వంద కోట్ల దాకా వసూలు చేసిన యానిమల్ 350 మార్కు దాటేసి బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఎలా ఉండబోతోందనే దాని మీద రేంజ్ తగ్గడం పెరగడం ఆధారపడి ఉంది. ప్రధాన నగరాల్లో వర్కింగ్ డేలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటం గమనార్హం. మొన్న శనివారం అర్ధరాత్రి షోలు చాలా పడ్డాయి.