చాడ్విక్ బోస్‌మన్.. రెండు రోజుల కిందట ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని విషాదంలో ముంచెత్తి తుది శ్వాస విడిచిన హాలీవుడ్ నటుడు. అతడి వయసు 43 ఏళ్లు మాత్రమే. నాలుగేళ్ల కిందట పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడిన అతను.. దాంతో పోరాడుతూనే సినిమాలు చేస్తూ వెళ్లాడు. కొన్ని నెలల కిందటే అతడి క్యాన్సర్ నాలుగో దశకు చేరుకుంది. చివరికి ఈ పోరాటంలో అతను ఓడిపోయాడు.
నాలుగేళ్ల కిందట క్యాన్సర్ బయటపడినపుడే అది మూడో దశలో ఉంది. అలాంటి స్థితిలో ఇంకెవరైనా అయితే సినిమాలు మానేసి చికిత్స మీదే దృష్టిపెడతారు. కానీ అతను మాత్రం సినిమాలు ఆపలేదు. ‘బ్లాక్‌పాంథర్’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీలో నటించాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంత హుషారుగా కనిపించాడో అందరికీ తెలిసిందే.
లోపల ఎంతో బాధను, నొప్పిని దాచుకుని అతను అంత హుషారుగా సినిమాల్లో నటించడం, బయట కూడా చాలా ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన క్యాన్సర్ వ్యాధి గురించి అత్యంత సన్నిహితులకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా చూసుకున్నాడతను.
అతడి వ్యక్తిగత జీవితం గురించి సామాన్య జనాలకు పెద్దగా తెలియదు. తాజాగా బోస్‌మన్ గురించి మరో ఆశ్చర్యకర విషయం బయటపడింది. అతను ఇంకొన్ని నెలల్లో తాను చనిపోబోతున్నానని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు.
గత ఏడాది అక్టోబరులో అతడికి గాయని సైమోన్ టేలర్‌తో నిశ్చితార్థం జరిగింది. అప్పటికే అతడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కొన్ని నెలల కిందటే అతడికి పెళ్లి జరిగింది. అప్పటికి తానింక బతికేది కొన్ని నెలలే అని అతడికి అర్థమైంది. అయినా సరే.. సైమోన్‌ను పెళ్లాడాడు. ఆమె కూడా విషయం అంతా తెలిసి అతణ్ని పెళ్లి చేసుకుంది. బోస్‌మన్ చనిపోయే సమయంలో ఆమె అతడి పక్కనే ఉందని కుటుంబం వెల్లడించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates