అనవసరంగా ముత్తుని తీసుకొచ్చి నలిపేశారు

రీ రిలీజుల ట్రెండ్ లో పాత క్లాసిక్స్ ని ఇప్పటి ప్రేక్షకులకు థియేటర్ లో కొత్తగా చూపించాలన్న పోకడ పూర్తిగా దారి తప్పుతోంది. క్రమంగా వీటి పట్ల జనంలో సన్నగిల్లుతున్న ఆసక్తిని బయ్యర్లు గుర్తించడం లేదు. ఫలితంగా ఇవి కనీస వసూళ్లు తేలేక వాటి పరువును తీస్తున్నాయి. ఇటీవలే అదుర్స్ ని గ్రాండ్ గా విడుదల చేస్తే పెద్దగా వసూళ్లు రాలేదు. పోకిరి, ఖుషి, ఆరంజ్ రేంజ్ లో దీనికి స్పందన వస్తుందనుకున్న డిస్ట్రిబ్యూటర్ల కోరిక నెరవేరలేదు. కారణం సినిమా బాలేక కాదు. మళ్ళీ మళ్ళీ కొత్త రేట్లతో పాత సినిమాల టికెట్లు కొని చూసే ఓపిక, స్థోమత రెండూ ఆడియన్స్ లో నశించిపోయాయి.

రేపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముత్తు వస్తోంది. యానిమల్ హడావిడిలో దీన్నెవరూ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ షోలైతే దొరికాయి కానీ మిగిలిన సెంటర్లలో థియేటర్ల కొరత వల్ల ఒకటి రెండు ఆటలతో సరిపెడుతున్నారు. అవి కూడా ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్లాన్ చేయడంతో అంత పొద్దునే ముత్తు కోసం వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇది మంచి సినిమానే కానీ మరీ బాషా, నరసింహ, అరుణాచలం రేంజ్ లో క్లాసు మాస్ మళ్ళీ మళ్ళీ చూసే రేంజ్ లో ఉండదు. ఏఆర్ రెహమాన్ పాటలు మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి.

అయినా బంగారు గుడ్లు పెట్టే బాతుని అత్యాశతో చంపుకున్నట్టు ఏదో కొత్త అనుభూతి కోసం పాత సినిమాలు థియేటర్లో చూస్తున్న వాళ్ళను స్వయంగా బయ్యర్లే దూరం చేసుకునే పరిస్థితి వచ్చేసింది. నెలకు నాలుగైదు క్యూలో పెట్టడం వల్ల మొత్తానికే మోసం వచ్చింది. ఇదిక్కడితో ఆగడం లేదు. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శివాజీని ప్లాన్ చేశారు. దీనికి ఏకంగా తెల్లవారుఝామున 6 గంటల షోలు ఉంటాయట. అయినా కామెడీ కాకపోతే యూట్యూబ్, ఓటిటిలో దొరికే వాటిని రుద్దడం కన్నా దళపతి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని ట్రై చేయొచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు అంటారేమో.