వసూళ్లు తగ్గడంపై విచిత్రమైన లాజిక్

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టైగర్ 3 అంచనాలకు తగ్గట్టు ఆడటం లేదన్నది వాస్తవం. వరల్డ్ కప్, దీపావళి లక్ష్మి పూజా లాంటి కారణాలు ఎన్ని చెప్పుకున్నా కంటెంట్ తేడా కొట్టిందనేది అత్యధికులు వ్యక్తం చేసిన అభిప్రాయం. లేదంటే సులభంగా జవాన్, పఠాన్ ఏదో ఒకదాన్ని దాటేసేది. ఇప్పటిదాకా పట్టుమని అయిదు వందల కోట్లు అందుకోలేక టైగర్ పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. కానీ దీన్ని ఒప్పుకోవడానికి కండల వీరుడికి మనసు రావడం లేదు. సామాన్యుడికి అందుబాటు ధరలో టికెట్లు అమ్మడం వల్లే తన సినిమాకు పెద్ద నెంబర్లు కనిపించడం లేదని అంటున్నాడు.

ఇదో విచిత్రమైన లాజిక్. ఎందుకంటే టైగర్ 3 విడుదలైన మొదటి వారంలో ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వలేదు. ఉత్తరాది రాష్ట్రాల మల్టీప్లెక్సులు తాము రెగ్యులర్ గా ఛార్జ్ చేసే ప్రీమియమ్ రేట్లే పెట్టాయి. సింగల్ స్క్రీన్లో ఎప్పుడూ ఉండేవే ఉన్నాయి. అలాంటప్పుడు తక్కువకు ఇచ్చామని చెప్పడానికి ఆస్కారం ఎక్కడుంది. రెండు వారాలు దాటాక పివిఆర్ ఐనాక్స్ చైన్ లో ఫ్లాట్ 150 రూపాయలు చేశారు కానీ అంతకు ముందు ఉన్నది అధిక రేటేగా. అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ చెబుతున్న వెర్షన్ ఎంత మాత్రం సబబు కాదు. పైగా ఇంకో వెరైటీ కామెంట్ కూడా చేశాడు.

రాబోయే సినిమాకు రేట్లు ఎక్కువ పెట్టి అప్పుడు తాను కూడా పెద్ద పెద్ద అంకెలు చూపిస్తానని అన్నాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా షారుఖ్ ని కౌంటర్ చేసినట్టే. మరి కెజిఎఫ్, కాంతార, పుష్పలు చాలా మాములు రేట్లకు సల్మాన్ బొమ్మలు ఆడిన చోటే వందల కోట్లు కురిపించాయిగా. ఈ తర్కం మర్చిపోతే ఎలా. ఇదంతా సల్మాన్ స్వయంగా టైగర్ 3 సక్సెస్ ని పంచుకోవడానికి ఉద్దేశించిన ఒక వీడియోలో చెప్పడంతో అది ఫ్యాన్స్ మధ్య బాగా తిరుగుతోంది. సోలోగా బ్లాక్ బస్టర్ కొట్టి సల్మాన్ కు చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇలా అంటున్నాడని యాంటీ ఫ్యాన్స్ కౌంటర్స్ వేయడం ఫైనల్ ట్విస్ట్