వార్ 2 విడుదల తేదీ మంచి ప్లానింగే

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 విడుదల తేదీ అఫీషియల్ గా వచ్చేసింది. 2025 ఆగస్ట్ 14 విడుదల చేయబోతున్నట్టు యష్ రాజ్ ఫిలింస్ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు గురువారం. అంటే ఇండిపెండెన్స్ డేని కలుపుకుని సుదీర్ఘమైన నాలుగు రోజుల వీకెండ్ దొరకునుంది. నిజానికి ఆ ఏడాది జనవరి చివర్లో రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తారనుకుంటే అప్పటికి షూటింగ్ అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ కు టైం సరిపోదన్న కారణంతో ఇంకో ఆరు నెలలు జరిపారని ముంబై టాక్. అంటే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇంకో సంవత్సరం తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సి ఉంటుంది.

బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ 2 కి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఆల్రెడీ మొదలైపోయింది. హృతిక్, తారక్ లేని సన్నివేశాలు మొన్న నెలే షూట్ చేశారు. ఇద్దరు హీరోలు కలిసి డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో సెట్లో అడుగు పెట్టబోతున్నారు. వందల కోట్లతో రూపొందుతున్న గ్రాండియర్ కావడంతో నిర్మాణం విషయంలో యష్ సంస్థ తొందరపడే ఉద్దేశంలో లేదు. పైగా స్పై యూనివర్స్ లో భాగంగా ఇటీవలే వచ్చిన టైగర్ 3 అంచనాలు పూర్తిగా అందుకోలేకపోవడంతో అలెర్ట్ అయిన టీమ్ స్క్రిప్ట్ విషయంలో మళ్ళీ కొత్తగా జాగ్రత్తలు తీసుకుంటోంది.

తారక్ వార్ 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది కానీ దాని తీరుతెన్నుల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం దేవరలో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వార్ 2తో పాటు సమాంతరంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంటుంది. అది అధిక భాగం విదేశాల్లోనే ఉంటుందని లీక్ వచ్చేసింది. ఈ లెక్కన యంగ్ టైగర్ డైరీ రెండు మూడేళ్లు చాలా రైట్ గా ఉండబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ రావడంతో ఇకపై అలా జరగకుండా తారక్ ప్లానింగ్ మార్చేసుకున్నాడు. 2024 దేవర, 2025లో వార్ రిలీజులు కన్ఫర్మ్ అయ్యాయి.