రాజ‌మౌళి మాట: అప్పుడు వ‌ర్మ ఇప్పుడు సందీప్

రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడి నుంచి గొప్ప ప్ర‌శంస అందుకుంటే.. అదొక స‌ర్టిఫికెట్ లాంటిదే. అలాంటి మేటి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ‌కు యానిమ‌ల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మామూలు ఎలివేష‌న్ ఇవ్వ‌లేదు. రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర్వాత ఫిలిం మేకింగ్ రూపు రేఖ‌ల‌ను మార్చిన ద‌ర్శ‌కుడు అంటూ సందీప్ రెడ్డిని కొనియాడాడు రాజ‌మౌళి.

”కొత్త కొత్త డైరెక్ట‌ర్లు వ‌స్తారు. పెద్ద సినిమాలు తీస్తారు. సూప‌ర్ హిట్లు కొడ‌తారు. చాలా పేరుసంపాదిస్తారు. కానీ ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌ను, ఇండ‌స్ట్రీనే కాక.. సినిమా అంటే ఇలాగే తీయాలి అనే ఫార్ములాల‌ను కూడా షేక్ చేసే ద‌ర్శ‌కులు వ‌స్తారు. మా త‌రంలో నాకు తెలిసి అలాంటి ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మనే అనుకుంటా. దాని త‌ర్వాత సందీప్ రెడ్డినే క‌నిపించాడు. సినిమాకు సంబంధించి అన్ని నార్మ్స్, ఫార్ములాల‌ను ప‌క్క‌న పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తా అని చాటిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు బ్ర‌ద‌ర్” అంటూ సందీప్‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తాడు రాజ‌మౌళి. ఈ మాట‌ల‌తో సందీప్ కూడా అమితానందానికి గుర‌య్యాడు.

మ‌రోవైపు యానిమ‌ల్ ర‌ణ‌బీర్ క‌పూర్‌ను త‌న ప‌క్క‌కు ర‌ప్పించి.. నీకు సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్ట‌మా అని అడ‌గ్గా.. అత‌ను ఔన‌ని స‌మాధానం ఇచ్చాడు. త‌ర్వాత రాజ‌మౌళి కొన‌సాగిస్తూ.. నీకు ఒకే ఒక్క సినిమా చేసే అవ‌కాశం ఉందంటే నాతో చేస్తావా.. సందీప్ రెడ్డితో చేస్తావా అని అడిగాడు. దీనికి ర‌ణ‌బీర్ బ‌దులిస్తూ.. రోజుకు రెండు షిఫ్టుల్లో రెండు సినిమాలూ చేస్తాన‌ని లౌక్యంతో బ‌దులిచ్చాడు. కానీ అలా కాదు, ఒక్క‌రితోనే అంటే ఎవ‌రితో చేస్తావ‌ని అడిగితే.. నేను సందీప్ రెడ్డినే ఎంచుకుంటా అని ర‌ణ‌బీర్ చెప్ప‌గా.. ఆడిటోరియం హోరెత్తింది.