ఫ్యామిలీ స్టార్.. పక్కా ప్లానింగ్

కొంచెం లేటుగా సంక్రాంతి రేసులోకి వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ను పండక్కి రిలీజ్ చేసే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నట్లే కనిపించాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఆయన ప్రణాళికలు ఫలించలేదు. సినిమాలో కీలకమైన ఫారిన్ షెడ్యూల్ అనుకున్నట్లుగా జరగకపోవడంతో సంక్రాంతి డేట్‌ను అందుకోవడం కష్టమని తేలిపోయింది. అసలే పోటీ ఎక్కువ. అలాంటి సీజన్ కోసం హడావుడి పడి ఔట్ పుట్ దెబ్బ తింటే అసలుకే మోసం వస్తుందని ‘ఫ్యామిలీ స్టార్’ టీం వెనక్కి తగ్గింది. సంక్రాంతికి ఈ సినిమా రావడం లేదన్నది స్పష్టం.

ఐతే నేరుగా ఈ విషయాన్ని ప్రకటించకుండా.. కొత్త డేట్‌ ఖాయం చేసుకుని అప్పుడే అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని టీం చూస్తోంది. సంక్రాంతి మిస్సయితే ఆటోమేటిగ్గా దృష్టి వేసవి మీదికే మళ్లుతుంది. దిల్ రాజు లాటి తెలివైన నిర్మాత.. సంక్రాంతి తర్వాత మొదలయ్యే డ్రై డేస్‌లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకోడు.

ఐతే వేసవిలో ఏప్రిల్ ఆరంభం నుంచే భారీ చిత్రాల సందడి మొదలైపోతుంది. కాబట్టి వేసవి ఆరంభంలోనే సినిమాను రిలీజ్ చేసేయాలని దిల్ రాజు చూస్తున్నాడు. మార్చి మధ్యలోనే ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. ఇందుకోసం సరైన డేట్‌ చూసుకుని త్వరలోనే ప్రకటన చేయబోతున్నారట.

వేసవికి పోటీ ఎక్కువ కాబట్టి కొంచెం ముందే సినిమాను రిలీజ్ చేస్తే ఇబ్బంది ఉండదని.. ఏప్రిల్ తర్వాత ఏ డేట్ ఎంచుకున్నా కష్టమే అని దిల్ రాజు ఆలోచిస్తున్నారట. సినిమా కూడా జనవరికల్లా రెడీ అయిపోతుంది కాబట్టి తాపీగా ప్రమోషన్లు చేసుకుని మార్చి మూడో వారంలో సినిమాను రిలీజ్ చేయాలని టీం భావిస్తున్నట్లు సమాచారం. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మధ్యే రిలీజైన టీజర్‌కు మంచి స్పందనే వచ్చింది.