టాలెంట్, కష్టపడే తత్వం రెండూ ఉన్నా గత కొంత కాలంగా హిట్టు కోసం తపించిపోతున్న సుధీర్ బాబు కొత్త సినిమా హరోంహర విడుదలకు సిద్ధమవుతోంది. సెహరి అనే చిన్న చిత్రంతో పరిచయమైన జ్ఞానసాగర్ ద్వారక ఈసారి పెద్ద అవకాశమే పట్టాడు. ఇవాళ టీజర్ ని రిలీజ్ చేశారు. ట్విట్టర్ వేదికగా మమ్ముట్టి, టైగర్ శ్రోఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలం, పుష్ప తరహాలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన కొన్ని కీలక క్లూస్ వీడియోలో ఇచ్చారు.
సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) హింసకు దూరంగా ఉంటాడు. ఎంత వద్దనుకున్నా అతన్ని వెతుక్కుంటూ తుపాకీ వచ్చి చేరుతుంది. తలలు పండిన నేరస్థులు ఉన్న మాఫియా రాజ్యంలోకి అడుగు పెడతాడు. కోరుకున్న ప్రేయసి(మాళవిక శర్మ)తో పాటు స్నేహితుడు(సునీల్), ప్రత్యర్థులు, అధికారులు అందరూ ఇతను చుట్టూ ఏర్పడ్డ వ్యూహ్యాన్ని చూస్తూ ఉంటారు. నెత్తురు వద్దనుకున్న యువకుడు రక్తపాతంలో మునిగి తేలాల్సి వస్తుంది. ఇంతకీ సుబ్రమణ్యం చేసే పనేంటి, ఎందుకు ఇందులో చిక్కుకున్నాడు, ఆయుధం పట్టి చివరికి ఏం చేశాడనేది అసలు కథ.
విజువల్స్ లో డెప్త్ కనిపిస్తోంది. రా అండ్ రస్టిక్ భావన కలిగించడంలో జ్ఞానసాగర్ సక్సెసయ్యాడు. ట్రెండ్ కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ రెండూ కుదిరాయి. చైతన్ భరద్వాజ్ నేపధ్య సంగీతం, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం రెండూ క్వాలిటీ కోసం తపనపడ్డాయి. తారాగణం పెద్దదే ఉంది. చిన్నా పెద్దా కలిపి భారీ సంఖ్యలో ఆర్టిస్టులను తీసుకోవడంతో నిండుతనం వచ్చింది. ఆసక్తి, అంచనాలు కలిగించడంలో హరోంహర బృందం విజయవంతమయ్యింది. వచ్చే ఏడాది ప్రభావంలో థియేటర్లలో వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ యాక్షన్ డ్రామాకు రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు.