యానిమల్.. ఏందయ్యా ఈ క్రేజు?

‘యానిమల్’ సినిమా తీసింది తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగనే కావచ్చు. కానీ అందులో హీరో సహా పలువురు కీలక పాత్రధారులు బాలీవుడ్‌కు చెందిన వారే. ఈ సినిమాను నిర్మించింది బాలీవుడ్ నిర్మాణ సంస్థ. కథ నేపథ్యం సహా అన్నీ ఉత్తరాది టచ్‌తోనే ఉన్నాయి.

ప్రాథమికంగా ఇది హిందీ సినిమా అనడంలో సందేహం లేదు. గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ సహా పలువురు తెలుగు దర్శకులు హిందీలో అక్కడి హీరోలతో సినిమాలు తీశారు. కానీ వాటికి వేటికీ రాని క్రేజ్ ‘యానిమల్’కు తెలుగులో కనిపిస్తోంది. ఈ సినిమా ప్రోమోలు మన ప్రేక్షకులకు పిచ్చెక్కించేశాయి.

ఒక తెలుగు స్టార్ హీరో నటించిన స్ట్రెయిట్ మూవీ స్థాయిలో దీని కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల క్యూరియాసిటీ ఏ స్థాయిలో ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమైపోతోంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఈ క్రేజ్‌ను బాగానే అర్థం చేసుకున్నట్లున్నారు.

‘యానిమల్’కు హైదరాబాద్‌లో ఉదయం 7.00 గంటల నుంచే షోలు మొదలైపోతుండటం విశేషం. ఆ షోలకు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఏఎంబీ సినిమాస్‌లో అయితే నాలుగు షోలకు టికెట్లు పడితే కొన్ని గంటల్లో అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఇంకా పలు షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి తొలి రోజు 7 గంటల షోలు కనీసం 50 అయినా పడేలా ఉన్నాయి.

అవన్నీ ఫుల్స్ పడితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హైదరాబాద్ అనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్‌లో పొద్దు పొద్దునే షోలు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. బహుశా ఏ హిందీ సినిమాకూ తెలుగులో ఇలాంటి క్రేజ్ చూసి ఉండకపోవచ్చు. ఇదంతా సందీప్ రెడ్డి ఘనతే అనడంలో సందేహం లేదు. దీనికే ఇలా ఉంటే.. ప్రభాస్‌తో అతను తీసే ‘స్పిరిట్’కు హైప్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు.