మాస్ మహారాజా రవితేజ వేగంగా సినిమాలు చేసే విషయంలో తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్ తో దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తలపెట్టిన మూవీ బడ్జెట్ కారణాల వల్లే ఆపేయాల్సి వచ్చినా దాన్నేమంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. మొత్తంగా ఆపేశారా లేక భవిష్యత్తులో మళ్ళీ తీస్తారా అంటే ప్రస్తుతానికి లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇదే కథని ఖర్చు తగ్గించి వేరే హీరోతో చేసే ప్లానింగ్ జరుగుతోంది. మూడు రాష్ట్రాల్లో మార్కెట్ ఉన్న ఒక సీనియర్ తమిళ స్టార్ ని ట్రై చేస్తున్నారని ఆల్రెడీ టాక్ వచ్చింది.
ఇది ఎలాగూ లేదు కాబట్టి దీని స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు బలంగా వినిపిస్తోంది. ఈ వార్త జూలైలోనే చక్కర్లు కొట్టింది కానీ ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేకపోవడంతో ఫ్యాన్స్ లేదనే అనుకున్నారు. తీరా చూస్తే స్క్రిప్ట్ రెడీ అవుతోందట. అజయ్ దేవగన్ నటించిన రైడ్ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఒక పెద్దమనిషి ఇంటికి ఐటి దాడులకు వెళ్లిన ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కు ఎదురయ్యే సంఘటనల నేపథ్యంలో ఇది రూపొందింది. ఇలియానా భార్యగా నటించింది.
ఇప్పుడీ రీమేక్ లోనూ తననే జోడిగా తీసుకోవచ్చట. ఇదే బ్యానర్ లో ధమాకా, ఈగల్ చేసిన రవితేజ దాంతో పాటు మొత్తం మూడు చిత్రాలకు ఒప్పందం చేసుకోవడం వల్లే ఇప్పుడీ రైడ్ రీమేక్ తెరమీదకు వచ్చిందని అంటున్నారు. షూటింగ్ వేగంగా చేయడంతో పాటు బడ్జెట్ పరంగా రిస్క్ లేని సబ్జెక్టు ఇది. పైగా ఫారిన్ లొకేషన్లు, ఖరీదైన సెట్లు అక్కర్లేదు. స్టూడియోలో ఒక ఇంటి సెట్ వేసి, మిగిలిన సన్నివేశాలు అవుట్ డోర్ లో తీస్తే సరిపోతుంది. భారీ పాటలు కూడా అక్కర్లేదు. ఎలా చూసుకున్నా రైడ్ సేఫ్ గేమ్ అవుతుంది. అఫీషియల్ గా ప్రకటించలేదు కాబట్టి అదొచ్చే దాకా వేచి చూడాలి.