సలార్ డంకీలకు భయపడని లాల్

డిసెంబర్ 21, 22 తేదీల్లో షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ పోటీని తలుచుకుని డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటి నుంచే నిద్ర పట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా వీటికి ఒకే రకమైన ఫీవర్ కనిపించేలా ఉంది. థియేటర్లు, షోల సర్దుబాటు కోసం ఎగ్జిబిటర్లు పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే డిసెంబర్ 15 ఎవరూ తమ సినిమాను రిలీజ్ చేసేందుకు జంకేంతగా. కేవలం వారం రోజుల రన్ కి రిస్క్ లో పడటం ఇష్టం లేక వదిలేస్తున్నారు. అయితే మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ మాత్రం అయితే ఏంటి నేనూ వస్తున్నాను అంటున్నారు.

ఆయన కొత్త చిత్రం నేరు డిసెంబర్ 21 విడుదల చేయబోతున్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ కావడంతో క్రేజ్ మాములుగా లేదు. దృశ్యం సృష్టికర్తగా ఆయన పరిచయం చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ని ఇప్పటికీ ఎందరో డైరెక్టర్లు ఫాలో అవుతూనే ఉన్నారు. వెంకటేష్ తో తీసిన తెలుగు రీమేక్ జీతూ జోసెఫ్ చేయకపోయినా ఓటిటిలో రిలీజైన సీక్వెల్ మాత్రం తనే హ్యాండిల్ చేశారు. సరిగ్గా పదేళ్ల క్రితం దృశ్యం విడుదలైన రోజే తమ కాంబో మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్యాన్ ఇండియా భాషల్లో చేస్తారో లేదో ఇంకా చెప్పలేదు కేరళలో మాత్రం సలార్, డంకీలకు చిక్కు తప్పదు.

మహా క్లాష్ కు నెల రోజుల కంటే తక్కువ టైం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు ప్రమోషన్ ప్లాన్లలో బిజీగా ఉన్నారు. ఒకటో తేదీ సలార్ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎలా పెరుగుతాయో చూడాలి. షారుఖ్ ఖాన్ టీజర్ వచ్చేసింది కాబట్టి కంటెంట్ మీద దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు. ఇక మోహన్ లాల్ నేరు పబ్లిసిటీని ఇంకొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు. మాములుగా అయితే దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కేరళలో షారుఖ్, ప్రభాస్ లు మిస్ చేసుకునే రెవిన్యూ కాస్త ఎక్కువే ఉంటుందని అక్కడి పంపిణీదారులు అంటున్నారు. దేనికైనా ఫైనల్ గా టాకే కీలకం.