ప్రేమించే మనిషి మృగంగా మారే ‘అనిమల్’

ఒక బాలీవుడ్ సినిమాని తెలుగు దర్శకుడి డైరెక్ట్ చేస్తే దాని మీద దేశవ్యాప్తంగా విపరీత అంచనాలు ఏర్పడటం ఒక్క అనిమల్ విషయంలోనే జరిగింది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా స్ట్రెయిట్ సబ్జెక్టుతో చేసిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో హైప్ మాములుగా లేదు. అందులోనూ 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేట్రికల్ వెర్షన్ ఏ సర్టిఫికెట్ తో విడుదలకు సిద్ధం కావడం పెద్ద రిస్క్. అయినా సరే డిసెంబర్ 1న విడుదల కాబోతున్న అనిమల్ ఇప్పటి యూత్ కి ఫీవర్ లా ఎక్కేలా ఉంది. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు ట్రైలర్ మీదే ఉన్నాయి. మూడున్నర నిమిషాల వీడియోలో కథేంటో చెప్పారు.

అర్జున్ సింగ్(రన్బీర్ కపూర్)కి చిన్నప్పటి నుంచి తండ్రంటే ప్రాణం. కానీ నిత్యం వ్యాపారంలో మునిగి తేలే బల్బీర్ సింగ్(అనిల్ కపూర్) కి కొడుకంటే ఆప్యాయత ఉండదు. పెద్దయ్యాక ఇంకా ప్రేమను పెంచుకున్న అర్జున్ శత్రువుల వల్ల బల్బీర్ చనిపోవడం చూసి తట్టుకోలేకపోతాడు. కంపెనీని తన ఆధీనంలోకి తీసుకుని ఎనిమి తల నరుకుతానని శపథం చేస్తాడు. మనిషి కాస్తా మృగంలా మారిపోయి అడ్డొచ్చిన వాళ్ళను కిరాతకంగా మట్టుబెడతాడు. చివరికి అసలు శత్రువు(బాబీ డియోల్) దొరుకుతాడు. అసలేం జరిగింది, గీతాంజలి(రష్మిక మందన్న) ఎవరు ప్రశ్నలకు సమాధానం అనిమల్ లో చూడాలి.

విజువల్స్ లో డెప్త్ గమనిస్తే సందీప్ వంగా మరోసారి వావ్ అనిపించేలా ఉన్నాడు. బీస్ట్, ఘోస్ట్ ఇలా ఏ పదాలను వాడినా సరిపోని హింసాత్మక అవతారంలో రన్బీర్ కపూర్ నటన, ఎక్స్ ప్రెషన్లు చాలా వయొలెంట్ గా ఉన్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక డిఫరెంట్ టోన్ తో వెంటాడేలా ఉంది. రష్మిక మందన్న, అనిల్ కపూర్ పాత్రలు హీరోతో సమానంగా ప్రాధాన్యం ఉన్నట్టు అనిపించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం, అమిత్ రాయ్ ఛాయాగ్రహణం సందీప్ వంగా ఆలోచనలను గొప్పగా ఆవిష్కరించాయి. డిసెంబర్ ఒకటి దాకా వారం రోజుల కౌంట్ డౌన్ ఫ్యాన్స్ కి భారమే ఇక.