రెండు వారాల క్రితం అనిమల్ నిడివి విషయంలో మా సైట్ చెప్పిందే నిజమయ్యింది. అక్షరాలా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్లకు ఫైనల్ వెర్షన్ ని లాక్ చేసి ఆ మేరకు సెన్సార్ చేయించారు. అంటే రెండు వందల నిమిషాల పాటు ఒక హింసాత్మక ప్రపంచంలో సందీప్ రెడ్డి వంగా విహరింపజేయబోతున్నాడు. రన్బీర్ కపూర్ సినిమా కాబట్టి ఏదైనా మినహాయింపుతో యు/ఏ వచ్చేలా చేసుకుంటారనే అంచనాలకు భిన్నంగా షాకింగ్ లెన్త్ ని లాక్ చేయడం బాలీవుడ్ సీనియర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లను సైతం ట్రిమ్ చేసి రిలీజ్ చేశారు.
స్వయంగా సందీప్ వంగానే ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో క్లారిటీ వచ్చేసింది. రేపు ట్రైలర్ మీద మాములు అంచనాలు లేవు. అందులో వయొలెన్స్ చూపిస్తారు కానీ యూట్యూబ్ స్ట్రీమింగ్ కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ చూసేలాగే మూడు నిమిషాల వీడియో కట్ చేయించారట.అయితే థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ మాత్రం మూడున్నర గంటలు హాలులో ఉండేందుకు సిద్ధం కావాల్సిందే. ఇంటి నుంచి బయలుదేరి, తిరిగి వచ్చే సమయం అదనంగా కలుపుకుని అనిమల్ కోసం ముందస్తుగా పెద్ద ప్లాన్ అవసరమయ్యేలా ఉంది. సందీప్ వంగా తన పంతం నెగ్గించుకున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ రెండు ఇంటర్వల్స్ ఇస్తారా లేక ఒకదానితో సరిపుచ్చుతారా అనేది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మూడు గంటల పదిహేను నిముషాలు దాటిన ఏ సినిమాకైనా గతంలో డబుల్ విశ్రాంతి ఇచ్చారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా షోలను షెడ్యూల్ చేసుకోవడం మల్టీప్లెక్సులకు ఇబ్బందిగా మారుతుంది. అందుకే పాటలు వచ్చినప్పుడు బయటికి వెళ్లడం మినహా వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. అనిమల్ కనక బ్లాక్ బస్టర్ అయితే నిడివి పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టించినట్టే అనుకోవాలి.