తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యల మీద కొన్ని రోజులుగా ఎంత దుమారం రేగుతోందో తెలిసిందే. లియో సినిమాలో త్రిషతో తనకు కాంబినేషన్ సీన్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆమెతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డానని మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యాఖ్యలను త్రిష, లోకేష్ కనకరాజ్ సహా కోలీవుడ్‌కు చెందిన అనేకమంది ప్రముఖులు ఖండించారు. నడిగర్ సంఘం మన్సూర్ మీద నిషేధానికి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి నితిన్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందిస్తూ.. మన్సూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు బాసటగా నిలిచారు.
ఐతే చిరు వ్యాఖ్యలను స్వాగతించాల్సింది పోయి.. ఆయన్ని కోలీవుడ్ అభిమానులు టార్గెట్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. కొన్ని సినిమా ఈవెంట్లలో హీరోయిన్లతో చిరు వ్యవహరించిన తీరును వాళ్లు తప్పుబడుతున్నారు. ఆచార్య సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో పూజా హెగ్డేతో, భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్‌తో చిరు కొంచెం సరదాగా.. రొమాంటిగ్గా వ్యవహరించారు. ఆ వేడుకలు చూసిన వాళ్లందరూ దాన్ని సరదాగానే తీసుకున్నారు.
కానీ ఇప్పుడు మన్సూర్ వ్యాఖ్యలను చిరు ఖండిస్తే.. ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఈ వీడియోలు పోస్ట్ చేసి ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు తమిళ నెటిజన్లు. సరదాగా చేసిందానికి, మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు ముడిపెడుతూ పరిణతి లేకుండా వ్యవహరిస్తున్నారు వీళ్లంతా. నిజానికి చిరును కోలీవుడ్ ప్రముఖులందరూ గౌరవిస్తారు. త్రిష సైతం చిరు మీద కొన్ని సందర్భాల్లో గౌరవ భావాన్ని ప్రకటించింది. అలాంటిది ఇష్యూను డైవర్ట్ చేస్తూ చిరును టార్గెట్ చేయడం విడ్డూరం.