త్రిషకు మద్దతుగా మన్సూర్ కు బుద్దొచ్చేలా

వయసు రాగానే సరిపోదు దానికి తగ్గట్టే బుద్దులు కూడా ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. కానీ కొందరికి ఇది వంటబట్టదు. తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషను ఉద్దేశించి అన్న మాటలు యావత్ సౌత్ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లియోలో తనకు వేషం ఇచ్చాక ఏదైనా బెడ్ రూమ్ లో హీరోయిన్ ని రేప్ చేసే సీన్ ఉంటుందేమోనని ఆశ పడ్డానని, కానీ కాశ్మీర్ షెడ్యూల్ లో కనీసం చూసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయాడు. దీని మీద త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో అతనున్న ఏ సినిమాలోనూ నటించనని గట్టి స్వరం వినిపించింది.

మన్సూర్ తాలూకు వీడియో ట్విట్టర్, ఇన్స్ టాలో విపరీతంగా వైరల్ అయ్యింది. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని త్రిషకు మద్దతు ఇచ్చాడు. మాళవిక మోహనన్ తదితరులు ఈ కామెంట్స్ పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1990 కెప్టెన్ ప్రభాకర్ ద్వారా విలన్ గా పరిచయమైన మన్సూర్ అలీ ఖాన్ ఓ దశాబ్దం పాటు బాగానే వెలిగాడు. తర్వాత వేషాలు తగ్గి గ్యాప్ వచ్చింది. ఇటీవలి కాలంలో కొత్త దర్శకులు పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడంతో కళ్ళు నెత్తికెక్కాయి.

ఇప్పుడే కాదు జైలర్ టైంలో తమన్నాను ఉద్దేశించి కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లియో సక్సెస్ మీట్ లో తాగి వచ్చి వేలాది ఫ్యాన్స్ ముందు ఏదేదో వాగాడు. అవన్నీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఇప్పుడు త్రిష మీద టార్గెట్ పెట్టడంతో ఒక్కసారిగా విమర్శలపాలయ్యాడు. అయినా లేటు వయసులో ఇదేం పాడుబుద్దని ఇండస్ట్రీ పెద్దలు ఆల్రెడీ మన్సూర్ కు క్లాస్ తీసుకున్నారట. అయినా మూర్ఖంగా వాదించే ఇలాంటి వాళ్లకు ఆఫర్లు ఇచ్చి ప్రోత్సహించడం కన్నా వెలి వేయడం లాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే జ్ఞానోదయం కలగదన్న వాదనలో అర్థముంది.