మంగ‌ళ‌వారం: వాళ్లిద్ద‌రి గ‌ట్స్‌కి హ్యాట్సాఫ్‌

ఈ శుక్ర‌వారం మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన మంగ‌ళ‌వారం.. ఆ అంచ‌నాల‌ను బాగానే అందుకుంది. ఆహా ఓహో అన‌లేం కానీ.. ఇది డీసెంట్ మూవీ అన‌డంలో సందేహం లేదు. ఆర్ఎక్స్ 100తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన త‌ర్వాత మ‌హాస‌ముద్రంతో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన అజ‌య్ భూప‌తి.. త‌న‌పై నెల‌కొన్న సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేశాడు.

మూడో సినిమాను క‌సిగా తీసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఇప్ప‌టిదాకా ఇండియాలో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్ ఇందులో డిస్క‌స్ చేశా అని అత‌ను ప్రి రిలీజ్ ఈవెంట్లో అంటే.. విడుద‌ల‌కు ముందు ఇలా గొప్ప‌లు పోవ‌డం మామూలేలే అనుకున్నారు చాలామంది. కానీ సినిమాలో కీల‌క‌మైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అత‌ను డిస్క‌స్ చేసిన పాయింట్ నిజంగా ఇండియా స్క్రీన్ మీద అరుద‌నే చెప్పాలి.

ఆర్ఎక్స్ 100 సినిమాలో క‌థానాయిక పాత్ర ఎంత షాకింగ్‌గా ఉంటుందో.. ఇందులో లీడ్ రోల్ క్యారెక్ట‌ర్ కూడా అంతే సెన్సేష‌న‌ల్‌గా అనిపిస్తుంది. కాక‌పోతే అందులో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి.. కానీ పాత్ర ల‌క్ష‌ణాలు దాదాపు అలాగే ఉన్నా పాజిటివ్ కోణంలో సాగుతుందీ పాత్ర‌. అక్క‌డ హీరోయిన్ పాత్ర మీద తీవ్ర‌మైన ద్వేషం ఏర్ప‌డితే.. ఇక్క‌డ జాలి క‌లుగుతుంది. ఈ పాత్ర‌ను డిజైన్ చేసిన విధానంలో ద‌ర్శ‌కుడి ప్ర‌త్యేక‌త క‌నిపిస్తుంది. తెర‌పై అలాంటి కాన్సెప్ట్ డిస్క‌స్ చేసి మెప్పించడం అంత తేలిక కాదు.

దీనికి ఎంతో క‌న్విక్ష‌న్, కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ కావాలి. జీర్నించుకోలేని విధంగా ఉండే ఆ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందా అనేలా సాగుతుంది. కానీ అజ‌య్ రాజీ ప‌డ‌కుండా తాను చెప్పాల‌నుకున్న‌ది స్ప‌ష్టంగా చెప్పాడు. అదే స‌మ‌యంలో శైలు పాత్ర‌ను పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా గొప్ప‌గా పోషించింది. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డానికి హీరోయిన్లు బెంబేలెత్తిపోతారు. క‌న్విన్సింగ్‌గా ఆ పాత్ర‌ను పెర్ఫామ్ చేయ‌డం అంత తేలిక కాదు. పాయల్ బోల్డ్ పెర్ఫామెన్స్‌తో మంచి మార్కులు వేయించుకుంది. వీళ్లిద్ద‌రి గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.