తమన్నా సినిమా యూట్యూబ్ రివ్యూలపై కేసులు

అదేంటి రివ్యూలు చెబితే కేసు పెడతారా అంటే ఔననే అంటున్నారు మల్లువుడ్ నిర్మాతలు. ఇటీవలే తమన్నా ప్రధాన పాత్రలో దిలీప్ హీరోగా నటించిన బాంద్రా విడుదలయ్యింది. ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా దాన్ని క్రమేణా నిలబెట్టుకోలేకపోయింది. అయితే కొందరు యూట్యూబర్లు దారుణంగా వీడియో రివ్యూలు ఇవ్వడంతో నిర్మాతకు ఎక్కడో కాలింది. వీళ్ళ వల్లే తమ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అరుణ్ గోపి దర్శకత్వంలో ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా రూపొందింది.

తిరువంతపురం కోర్టులో నమోదైన కేసులో అష్వంత్, షీహాబ్, ఉన్ని వ్లాగ్స్, మహమ్మద్, అర్జున్, షిజోస్ టాక్స్, సాయికృష్ణన్ లను నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ళు నడిపే ఛానల్స్ లో లక్షలాది సబ్స్క్రైబర్లు ఉండటంతో ఆ ప్రభావం పడి జనం థియేటర్లకు రావడం మానేస్తున్నారని ప్రొడ్యూసర్ కంప్లయింట్. జనాలను తప్పుదోవ పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ వ్యక్తిగతంగా దూషణలు చేస్తే తప్ప ఇలాంటి కేసులు నిలబడవు. అలాంటిది సినిమా మీద రివ్యూ ఇచ్చారు కాబట్టి శిక్షించాలనే లాజిక్ చెల్లదు.

దీని తాలూకు పరిణామాల పట్ల ఇతర బాషల నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాయర్లు మాత్రం ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదని, ఒక సినిమా థియేటర్ కు వచ్చాక పబ్లిక్ ప్రాపర్టీగా మారిపోతుందని, అలాంటప్పుడు దాని మీద అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చట్టం ఎలా అయితే వర్తిస్తుందో అలాగే సినిమాలను లక్ష్యంగా పెట్టుకునే యూట్యూబర్స్ మీద కూడా లా ప్రయోగించాలని సదరు నిర్మాత వెర్షన్. గత ఏడాది రివ్యూయర్లను చంపే కాన్సెప్ట్ తో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే.