‘టైగర్’ మెడకు ఫేక్ కలెక్షన్ల గొడవ

సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘టైగర్-3’ మీద ఆయనతో పాటు అభిమానులు, బాలీవుడ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాది పఠాన్, జవాన్‌ సినిమాల తర్వాత బాలీవుడ్‌కు మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. చాలా ఏళ్లుగా నిఖార్సయిన హిట్ లేని సల్మాన్‌కు ‘టైగర్-3’ ఆ కొరత తీర్చేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ‘టైగర్-3’ అంచనాలను అందుకోలేకపోయింది.

దీపావళి రోజు రిలీజైన ఈ చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ.. నెగెటివ్ టాక్ రావడంతో క్రమంగా వసూళ్లు తగ్గిన సంకేతాలు కనిపించాయి. సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా ఫెయిల్యూర్ అని క్రిటిక్స్ తేల్చేశారు. ఐతే ఈ సినిమా కలెక్షన్ల రిపోర్టులు మాత్రం ఘనంగా ఉంటున్నాయి. రోజూ నిర్మాతలు, కొందరు ట్రేడ్ పండిట్లు ప్రకటిస్తున్న వసూళ్లకు, వాస్తవ కలెక్షన్లకు పొంతన లేదనే చర్చ నడుస్తోంది.

ఓవైపు ‘టైగర్-3’ సినిమా ఆడుతున్న థియేటర్లకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్స్ చూస్తే పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ముంబయి, ఢిల్లీ సహా మేజర్ సిటీస్ అన్నింట్లోనూ చాలా వరకు షోలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు చాలా తక్కువగా ఉన్నాయి. రిలీజైన మూడో రోజుకే ఈ పరిస్థితి కనిపించింది. నాలుగో రోజు ఇండియా-న్యూజిలాండ్ ప్రపంచకప్ సెమీఫైనల్ ఉండటంతో కలెక్షన్ల మీద మరింత ప్రతికూల ప్రభావం పడింది. ఆ రోజు ఇండియా మొత్తంలో రూ.15 కోట్ల వసూళ్లు వచ్చే పరిస్థితి కూడా లేదంటే ట్రేడ్ పండిట్లు మాత్రం రూ.20 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లుగా అనౌన్స్ చేశారు.

మార్నింగ్ టు నైట్ షోలు పూర్తిగా వెలవెలబోయిన రోజు ఈ వసూళ్లు ఫేక్ చర్చ సోషల్ మీడియాలో నడిచింది. ఆల్రెడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర పడుకుందని.. కానీ టీం, ట్రేడ్ పండిట్లు మాత్రం వసూళ్ల ప్రకటనల్లో తగ్గట్లేదని.. వరల్డ్ వైడ్ అప్పుడే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును కూడా అందుకుందని చెబుతున్నారు. విదేశాల్లో ‘టైగర్-3’ పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉండగా.. దీన్నొక బలవంతపు బ్లాక్‌బస్టర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది.